శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల పరిధిలోని 16 అవుట్‌లెట్ కేంద్రాలను తన పరిధిలోకి చేర్చేందుకు నిర్ణయిస్తూ కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) తీర్మానం చేసింది. గెజిట్ అమలుకు అనుగుణంగా 14వ తేదీలోగా తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ తీర్మానాన్ని పంపేందుకు నిర్ణయించింది. రాష్ట్రాలు ఆమోదించి ఉత్తర్వులు జారీ చేస్తే గానీ గెజిట్ అమల్లోకి రాదు. ఈ ఉత్తర్వుల విడుదలకు ఏపీ సానుకూలత వ్యక్తం చేసింది. జల విద్యుత్ కేంద్రాలను బోర్డు పరిధిలోకి తీసుకురావడానికి తెలంగాణ నిరాకరించింది. దీంతో గడువులోపు గెజిట్ అమలుపై అనిశ్చితి నెలకొంది. మంగళవారం హైదరాబాద్‌లోని జలసౌధలో కేఆర్‌ఎంబీ ఛైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన బోర్డు 15వ సమావేశం జరిగింది. తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్, ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి బోర్డు సభ్యులు రవికుమార్ పిళ్లై, ముతాంగ్, రాయ్‌పురే పాల్గొన్నారు. ప్రతిపాదించిన ప్రాజెక్టులను గెజిట్ పరిధిలోకి చేర్చే విషయమై ఉప సంఘం 30 కేంద్రాలకు సంబంధించి రూపొందించిన నివేదికపై బోర్డు సమావేశంలో చర్చించారు.
రాష్ట్రాలు ఆమోదించాల్సిన ప్రాజెక్టులివే...
కేంద్ర గెజిట్‌లోని షెడ్యూల్-2లో పేర్కొన్న ప్రాజెక్టుల్లో మొదటి విడతగా కొన్నిటిని బోర్డు పరిధిలోకి తీసుకునేందుకు కేఆర్‌ఎంబీ నిర్ణయించింది. తీర్మానంలో వాటిని పొందుపరిచింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల కింద మొత్తం 16 డైరెక్ట్ అవుట్‌లెట్లను ప్రతిపాదించవచ్చని సమాచారం. గడువులోపు గెజిట్ అమలుకు వీలుగా శ్రీశైలం, సాగర్‌ల పరిధిలో ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టులను రాష్ట్రాలు అప్పగించాలని కోరుతూ మంగళవారం నిర్ణయం తీసుకున్నట్లు సమావేశం అనంతరం విడుదల చేసిన పత్రికాప్రకటనలో బోర్డు పేర్కొంది.
తెలంగాణ ససేమిరా.. ఏపీ సమ్మతి
బోర్డు జాబితాలో జల విద్యుత్ కేంద్రాలు కూడా ఉండటంతో తెలంగాణ అంగీకరించలేదని తెలిసింది. కృష్ణా జలాల కేటాయింపుల అంశం సుప్రీంకోర్టులో ఉందని, ఇప్పుడు గెజిట్ అమలు చేయడం సరికాదని పేర్కొన్నట్లు సమాచారం. శ్రీశైలం ప్రాజెక్టు జల విద్యుదుత్పత్తి కోసమే నిర్మించిందని, రాష్ట్ర అవసరాలకు ఉత్పత్తి తప్పదని పేర్కొన్నట్లు తెలిసింది. హంద్రీ నీవా, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ను కూడా చేర్చాలని తెలంగాణ సూచించగా, ఏపీ అంగీకరించలేదని సమాచారం. గెజిట్ అమలుకు ఉత్తర్వులిచ్చేందుకు తాము అనుకూలంగా ఉన్నామని ఏపీ స్పష్టం చేసినట్లు తెలిసింది. తెలంగాణ జల విద్యుత్ కేంద్రాలను చేర్చితేనే ఏపీ పరిధిలోని రెండు కేంద్రాలను బోర్డు అధీనంలోకి వెళ్లడానికి అంగీకరిస్తామని కూడా పేర్కొన్నట్లు సమాచారం. సీడ్‌మనీపైనా రెండు రాష్ట్రాలు బోర్డు నుంచి స్పష్టత కోరినట్లు తెలిసింది.
రాష్ట్రాల ఉత్తర్వులు కీలకం