ఇవాళ కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల భేటీ ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. దిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి బోర్డుల ఛైర్మన్లతో సమావేశమవ్వనున్నారు. ఈ భేటీలో బోర్డుల పరిధికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ అమలుపై చర్చింబోతున్నారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్(gazette notification)పై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నందున దీనిపై చర్చించేందుకు కేంద్రం అత్యవసరం సమావేశం ఏర్పాటు చేసింది. ఈ రోజు దిల్లీలో జరిగే ఈ సమావేశానికి నేరుగా హాజరు కావాలని కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్‌లను కోరింది. నోటిఫికేషన్ అమలు తేదీని వాయిదా వేయాలని, రెండో షెడ్యూలులోని ప్రాజెక్టుల విషయంలో మార్పు చేయాలని రాష్ట్రాలు కోరుతున్న నేపథ్యంలో కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ నిర్వహించనున్న అత్యవసర సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. కృష్ణా, గోదావరి పరిధులను ఖరారు చేస్తూ జులై 15న కేంద్రం గెజిట్ జారీ చేసింది.
అక్టోబరు 14 నుంచి అమలులోకి వస్తుందని పేర్కొంది. అనుమతి లేని ప్రాజెక్టులకు ఆరు నెలల్లోగా అనుమతులు పొందాలని, లేకుంటే నిలిపివేయాలని కూడా పేర్కొంది. ఈ పరిస్థితుల్లోనే సెప్టెంబరు ఒకటిన కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త సమావేశం జరిగింది. గెజిట్‌లో పేర్కొన్న గడువుల ప్రకారం చేయడం సాధ్యం కాదని, దశలవారీగా అయితే ఇబ్బంది ఉండదని రెండు రాష్ట్రాలూ వివరించాయి. ట్రైబ్యునల్.. నీటిని కేటాయించకుండా అనుమతులు ఎలా వస్తాయని తెలంగాణ ప్రశ్నించింది. కాలువలు తెగిపోవడం, డ్యాంల నిర్వహణలో సమస్యలు వస్తే ఎలా చేస్తారని, మీ దగ్గర ఏ యంత్రాంగం ఉందని, ఒక రోడ్‌మ్యాప్ ఉండాలని సూచించింది.