ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గోకులాష్టమి పర్వదినం - గోకులాష్టమి గురించి

ఎండమావిలో నీటి వంటిది, నిజమనిపించే కలలోని దృశ్యం లాంటిది- ఈ సంసారం (ప్రపంచం) అలాగే-. పుత్ర, మిత్ర, కళత్రాదులు, వారితో ఏర్పడ్డ బంధనాలు అన్నీ మిథ్యేనంటారు విజ్ఞులు. అయినా వాటికోసం వెంపర్లాట ఆగదు. ఆ అజ్ఞానంలోనే ఆనందం ఉంది జీవులకు. వారు పొందే ఆనందానికి విఘాతం, రసభంగం కలగకుండా పరిపుష్టం చేసి, ఆ బాటలోనే నడిపించి, మురిపించి, చెప్పీ చెప్పనట్టు ‘సృష్టిలోని అంతరార్థం ఇదే’ అని ఎరుక పరచడానికి విష్ణువు ధరించిన అవతారం కృష్ణావతారం. తలపించి, మైమరపించి, కోరినవన్నీ కురిపించి, అంతలోనే అన్నీ మరిపించి ‘ఇదే జీవితం’ అని బోధించిన బోధకుడు శ్రీకృష్ణుడు. ‘లోకంలో లేని చోద్యాలన్నీ నీలోనే ఉన్నాయి. నీలో లేని చోద్యాలు లోకంలో ఏమీ లేవు’ అని భాగవత దశమస్కంధంలో అక్రూరుడు అనడం వెనక పరమార్థం అదే.

krishnastami
krishnastami

By

Published : Aug 11, 2020, 11:19 AM IST

బందిఖానాలో పుట్టినవాడు జీవుల భవ బంధాలను ఛేదించాడు. ఎందరికో ఎన్నో విధాల బంధువయ్యాడు. ఆ బాంధవ్యం వెనుక విష్ణు లీలా విలాసం ఉంది. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం తాను దాల్చబోయే కృష్ణావతారంలో తనకు సహకరించడానికి గాను దేవతలందరినీ భూలోకంలో అవతరించమని కోరాడు విష్ణువు. ‘నీ సాన్నిధ్యం వీడి ఉండలేం’ అన్నారు దేవతలు. ‘మీకు సహచరుడిగా నేనుంటాను-’ అన్నాడు. విష్ణువు సాహచర్యం వీడదని తెలిసిన దేవతలంతా ఆనందంతో సరేనన్నారు. ఆ ఆనంద స్వరూపమే నందవ్రజంగా రూపుదాల్చింది. దేవతాగణాలు, వారి పరివారం, వేదాలు, వాటి భాగాలైన రుక్కులు, తాత్పర్యాలు... గోకులంలో వివిధ రకాలుగా రూపు దాల్చాయి.

ఆ తరవాత శ్రీమహావిష్ణువు దేవకీ గర్భాన శిశువుగా అవతరించాడు. యశోదాదేవి పెంపకంలో పెరిగాడు. పరవసింపజేసే పసితనం, ముచ్చట గొలిపే చిలిపితనం, మురిపించే గడసుదనం, అక్కున చేర్చకునే ఆత్మీయతత్త్వం, చెంతనే ఉండి చింత తీర్చే చెలిమి, సాన్నిహిత్యంతో కూడిన సాహచర్యం వీటన్నింటి కలగలుపు- లౌకికం, ఆధ్యాత్మికం, వేదాంతం లాంటివన్నీ మూర్తీభవించిన పరిపూర్ణా వతారం... శ్రీకృష్ణావతారం. ఎనిమిదవ సంఖ్యకు శ్రీకృష్ణుడికి అవినాభావ సంబంధం ఉంది. పుట్టిన తిథి, అవతారాల్లో సంఖ్య, వసుదేవుడి సంతానంలో సంఖ్య, ఆయనకున్న భార్యల సంఖ్య... అన్నీ ఎనిమిదే.

కొడుకుగా యశోదను మురిపించిన తీరుచూసిన ప్రతి తల్లీ తనబిడ్డ అలాగే ఉండాలని కోరుకుంటుంది. ఊహించుకుంటుంది. అలాగే అతడితో ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుబంధం పెరిగింది. జగత్తంతటికీ ఆయనే తల్లి తండ్రి, గోప నివహానికి ప్రియసఖుడు, సుదాముడికి తోడునీడ, అర్జునుడికి గురువు, గోపికలకు దైవం, రుక్మిణికి పతి, విశ్వానికి గతి, భక్తులకు ప్రియుడు... ఎవరెవరు ఎలా తలిస్తే/కొలిస్తే/పిలిస్తే అలాగే ప్రతిస్పందించే మోహన రూపుడాయన. ఇలా అందరికీ అన్నీ అయిన ఆయనను ఎవరికి వారుగా ‘నావాడే’ అని భావించి బంధనాలు పెంచుకున్నారు. ఆయన కూడా అందరూ ‘నావారే’ అని భావించి వారందరికీ ప్రేమానురాగాలు పంచి భవబంధాలనూ తుంచాడు. అందుకే కృష్ణుడు అందరివాడయ్యాడు. ఇలా దశావతారాల్లో కృష్ణావతారం మాత్రమే పరిపూర్ణమైనదై అందరికీ ఆనందం కలిగించింది. అందుకే ‘నిరుక్తం’ (అనే శాస్త్రం) కృష్ణ శబ్దానికి ‘లోకానికి ఆనంద కారకుడు’ అని చెబుతోంది. సూర్యోదయంతో అంధకారం సమసిపోయినట్లు గానే, అప్రమేయ తేజస్వి అయిన కృష్ణనామ సంకీర్తన మాత్రం చేతనే పాపం పటాపంచలై పోతుందని పద్మపురాణం ఈ శ్రీకృష్ణనామ మహిమను తెలుపుతోంది. అవతారాలన్నింటిలోనూ షోడశ కళా ప్రపూర్ణమైంది కృష్ణావతారమే. అందుకే ఆయన జన్మదినం లోకానికి పర్వదినం.

ఇదీ చదవండి:ఎస్ఈసీగా నిమ్మగడ్డ పునర్ నియామకంపై సుప్రీంలో విచారణ

ABOUT THE AUTHOR

...view details