ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని 15 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం గాలేరు-నగరి సుజల స్రవంతిపై ఎత్తిపోతల పథకాన్ని చేపట్టేందుకు ఏపీ ఉత్తర్వులు జారీ చేసిందని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్.. కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలంలో మలకవేములు ఎత్తిపోతల పథకానికి కూడా పరిపాలనా అనుమతలు మంజూరు చేశారని ఫిర్యాదు చేశారు.
ఈ రెండు కూడా కొత్త ప్రాజెక్టులేనని... విభజన చట్టం ప్రకారం బోర్డు అనుమతి, అత్యున్నత మండలి ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టరాదని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన కొత్త ప్రాజెక్టుల వివరాలను ఫిర్యాదులో పొందుపరిచారు. రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు విస్తరణ సహా మొత్తం 47 వేల 776 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఏపీ... 30 ప్రాజెక్టులను చేపట్టిందని అందులో పేర్కొన్నారు.