ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

డబ్బులు కట్టిన నాలుగేళ్ల తర్వాత భూకేటాయింపులు రద్దా? అవసరమైతే న్యాయపోరాటం చేస్తాం - అవసరమైతే న్యాయపోరాటం చేస్తాం

APIIC: రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార సంస్థలా వ్యవహరిస్తు.. పారిశ్రామికవేత్తలకు అన్యాయం చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావటమే కష్టంగా ఉంటే.. ఉన్నవాటికీ సహకరించడం లేదు. ఏపీఐఐసీ నిర్వాకంతో కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామిక పార్కులో భూములు పొందిన పారిశ్రామికవేత్తలు నష్టపోతున్నారు.

APIIC
డబ్బులు కట్టిన నాలుగేళ్ల తర్వాత భూకేటాయింపులు రద్దా? అవసరమైతే న్యాయపోరాటం చేస్తాం

By

Published : May 17, 2022, 8:37 AM IST

APIIC: రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార సంస్థలా వ్యవహరిస్తోంది. పారిశ్రామికవేత్తలకు అన్యాయం చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావటమే కష్టంగా ఉంటే.. ఉన్నవాటికీ సహకరించడం లేదు. కోర్టు వివాదంలో ఉన్న భూములను పారిశ్రామికవేత్తలకు 2018లో కేటాయించి.. నాలుగేళ్ల తర్వాత వాటిని రద్దు చేస్తామంటూ నోటీసులిస్తోంది. ఇప్పటికే 70 మందికి నోటీసులు పంపింది. ఇదే పారిశ్రామికపార్కులో ఖాళీగా ఉన్న ప్లాట్లను వారికి కేటాయించడానికి నిబంధనలు అడ్డుపడుతున్నాయంటోంది. ఏపీఐఐసీ నిర్వాకంతో కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామిక పార్కులో భూములు పొందిన పారిశ్రామికవేత్తలు నష్టపోతున్నారు.

చెల్లించిన మొత్తం వెనక్కి ఇచ్చేస్తాం

మల్లవల్లి పారిశ్రామిక పార్కును సుమారు 1,100 ఎకరాల్లో గత ప్రభుత్వం అభివృద్ధి చేసింది. చదరపు మీటరుకు రూ.408.. అంటే, ఎకరా రూ.16.5 లక్షల వంతున 399 మంది పారిశ్రామికవేత్తలకు ఏపీఐఐసీ కేటాయించింది. వీటిలో 110 ఎకరాల భూములపై హైకోర్టులో కేసులు దాఖలయ్యాయి. ఈ భూముల్లో ప్లాట్లను పొందిన పారిశ్రామికవేత్తలు ఏపీఐఐసీకి పూర్తిమొత్తం చెల్లించి.. విక్రయ ఒప్పందం పొందారు. ఇప్పుడు అవే ప్లాట్ల కేటాయింపును రద్దుచేస్తూ.. అప్పట్లో తీసుకున్న మొత్తాన్ని వెనక్కి ఇస్తామని పారిశ్రామికవేత్తలకు పంపిన నోటీసుల్లో ఏపీఐఐసీ పేర్కొంది.

ప్రత్యామ్నాయ ప్లాట్లు ఇవ్వాలన్నా...

కోర్టు వివాదంలో ఉన్న భూములను కేటాయించడం ఏపీఐఐసీ తప్పిదమని.. ఇదే పార్కులో ఖాళీగా ఉన్న ప్లాట్లను ప్రత్యామ్నాయంగా కేటాయించాలని కోరుతూ పారిశ్రామికవేత్తలు అధికారులకు వినతిపత్రాలను అందించారు. వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. ఆ ప్లాట్ల కేటాయింపును రద్దుచేయాలని 2021 డిసెంబరు 15న జరిగిన బోర్డు సమావేశంలో ఏపీఐఐసీ నిర్ణయం తీసుకుంది. 18% జీఎస్టీ, ప్రాసెసింగ్‌ ఫీజులను మినహాయించి మిగిలిన మొత్తాన్ని వెనక్కి ఇవ్వాలని తీర్మానించింది. అప్పట్లోనే నిర్ణయం తీసుకుంటే.. నోటీసులు ఇవ్వడానికి ఇంత వ్యవధి ఎందుకు?

నిబంధనలు అంగీకరించవా?

2018లో నిర్దేశించిన ధరలను... తర్వాత రెండుమూడు సార్లు సవరించింది. ప్రస్తుతం చ.మీ. రూ.2,204 వంతున నిర్దేశించింది. అంటే.. ఎకరా రూ.80 లక్షలు అవుతుంది. ఈ పార్కుల్లో 327 ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. కోర్టు వివాదంలో ఉన్నవాటికి బదులుగా పారిశ్రామికవేత్తలకు ఖాళీప్లాట్లను కేటాయించడానికి నిబంధనలు అడ్డుగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు పాత ప్లాట్ల కేటాయింపును రద్దు చేసుకుని.. మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి. అంటే పెంచిన ధరలకే ప్లాట్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రెండు దఫాలుగా రద్దు నోటీసులు

ప్లాటు ధర మొత్తాన్ని నిర్దేశిత వ్యవధిలో చెల్లించలేదంటూ.. 2019లో 70 మంది ప్లాట్లను ఏపీఐఐసీ రద్దుచేసింది. దానిపై ఇప్పటికీ వివాదం నడుస్తోంది. తాజాగా మరో 70 మందికి కేటాయించిన ప్లాట్లను రద్దు చేస్తున్నట్లు నోటీసులిస్తోంది. నాలుగేళ్ల పాటు ప్లాట్ల కోసం చెల్లించిన మొత్తాన్ని దగ్గర పెట్టుకుని.. ఇప్పుడు వెనక్కి ఇవ్వడమేంటని.. దీనిపై న్యాయపోరాటం చేస్తామని పారిశ్రామికవేత్తలు తెలిపారు.

రద్దు చేస్తూ నోటీసులు: జోనల్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌

కోర్టు వివాదంలో ఉన్న ప్లాట్ల కేటాయింపును రద్దుచేస్తూ పారిశ్రామికవేత్తలకు నోటీసులు పంపుతున్నట్లు ఏపీఐఐసీ విజయవాడ జోనల్‌ మేనేజర్‌ డి.శ్రీనివాస్‌ తెలిపారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details