ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోతిరెడ్డిపాడుపై రాష్ట్రాన్ని వివరాలు కోరనున్న కృష్ణా బోర్డు!

రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టేందుకు జారీ చేసిన జీవోకు సంబంధించిన వివరాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరనుంది కృష్ణా నదీ యాజమాన్య బోర్డు. ఏపీ నుంచి సమాధానం వచ్చిన తర్వాత మొత్తం వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనుంది.

krishna-board
krishna-board

By

Published : May 15, 2020, 8:04 AM IST

రాష్ట్ర‌ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టేందుకు జారీ చేసిన జీవోకు సంబంధించిన వివరాలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కోరనుంది. ఏపీ‌ నుంచి సమాధానం వచ్చిన తర్వాత మొత్తం వ్యవహారాన్ని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. శ్రీశైలం నుంచి రోజూ మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా కొత్త పథకాన్ని చేపట్టడటం, శ్రీశైలం ఎడమగట్టు కాలువ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు విస్తరించడానికి జారీ చేసిన జీవో విషయంలో ఏపీ ప్రభుత్వం ముందుకెళ్లకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం బోర్డును కోరిన సంగతి తెలిసిందే. దీనిపై బోర్డు నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని, పూర్తి వివరాలను కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్తామని ఛైర్మన్‌ బదులిచ్చినట్లు తెలిసింది. ఏపీ నుంచి పూర్తి వివరాలు కోరి, వారి సమాధానం ఆధారంగా నివేదిక తయారు చేసి కేంద్రానికి పంపనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై కేంద్రం అపెక్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేసి చర్చించే అవకాశాలు ఉంటాయి.

రెండు వారాల తర్వాతే తెలంగాణ చర్యలు..!
బోర్డుకు ఫిర్యాదు చేసిన రెండు వారాల సమయం ఇచ్చి, తర్వాత చర్యలకు ఉపక్రమించాలనే అభిప్రాయంతో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి బోర్డు వివరాలు తీసుకోవడం, జల్‌శక్తి మంత్రిత్వశాఖకు పంపడం వీటన్నిటికీ సమయం పడుతుంది కనుక, రెండు వారాల గడువు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే రెండు రాష్ట్రాలు ప్రాజెక్టులపై పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర నివేదికలు ఇమ్మని బోర్డు కోరినా ఎవరూ స్పందించలేదు. తెలంగాణలో కొత్త ప్రాజెక్టులు లేవు కనుక తాము ఇవ్వాల్సిందేమీ లేదని తెలంగాణ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు ఏం సమాధానం ఇస్తుందో చూడాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details