నీటి పంపిణీ సహా వివాదాస్పదంగా ఉన్న పలు అంశాలు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో ఓ కొలిక్కి వస్తాయా లేక మళ్లీ పంచాయితీ కేంద్రం వద్దకు పోతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. కీలకమైన పలు అంశాలపై చర్చించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు బుధవారం ఉదయం సమావేశం కానుండగా, బోర్డు పరిధికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త సమావేశం సాయంత్రం జరగనుంది.
నోటిఫికేషన్ అమలుపై...
నోటిఫికేషన్ అమలుపై బోర్డులు చర్చిస్తాయి, అభ్యంతరాలు ఏమైనా ఉంటే కేంద్రానికి నివేదించుకోమని సూచించే అవకాశం ఉంది. ఇప్పటికే కృష్ణా నదిపై ఉన్న ప్రధాన ప్రాజెక్టులను మాత్రమే పూర్తిగా బోర్డు పరిధిలో ఉంచితే సరిపోతుందని, అన్ని ప్రాజెక్టులు అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖకు లేఖ రాసింది. తెలంగాణ కూడా దీనిపై వివరంగా చర్చించింది. తన అభిప్రాయాన్ని బోర్డు సమావేశంలో చెప్పడంతోపాటు కేంద్రం దృష్టికి తీసుకెళ్లనుంది.
నీటి వాటాలే ప్రధానం
ఈ సమావేశంలో ప్రధాన చర్చ అంతా కృష్ణా బోర్డు ఎజెండాపైనే జరగనుంది. 2015-16 నుంచి ప్రతి సంవత్సరం పొడిగిస్తూ వచ్చిన నీటి కేటాయింపుల తాత్కాలిక ఏర్పాటును మార్చాలని తెలంగాణ కోరింది. 2015 జూన్ 18, 19 తేదీల్లో కేంద్ర జలవనరుల శాఖ వద్ద చర్చలు జరిగాయి. బచావత్ ట్రైబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీలలో తెలంగాణ 299, ఆంధ్రప్రదేశ్ 512 టీఎంసీలు వినియోగించుకొనేలా అప్పుడు తాత్కాలిక ఏర్పాటు జరిగింది. రెండు రాష్ట్రాలు, కేంద్ర జలవనరుల శాఖ అధికారులు దీనిపై సంతకాలు చేశారు. ఇది కొనసాగుతుండగానే చిన్ననీటి వనరుల వినియోగం, గోదావరి నుంచి కృష్ణాలోకి మళ్లించే నీటిలో వాటా అంశం తెరమీదకు వచ్చాయి. దాంతో ఈ రెండూ పక్కన పెట్టి మిగిలిన నీటిలో తెలంగాణ 34 శాతం, ఆంధ్రప్రదేశ్ 66 శాతం వినియోగించుకొనేలా ఏర్పాటు జరిగింది. గత నీటి సంవత్సరం వరకు ఇదే కొనసాగింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో చెరి 50 శాతం చొప్పున ఉండాలని తెలంగాణ కోరగా, 30 శాతం తెలంగాణకు, తమకు 70 శాతం ఉండాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. ఎవరి వాదనను వారు సమర్థించుకొనేందుకు భారీ కసరత్తు చేశారు. దీనిపై బోర్డు సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుండగా, ఓ అభిప్రాయానికి రావడం అంత సులభంగా కనపడటం లేదు. ఇక్కడ అంగీకారం కుదరకపోతే పంచాయతీ కేంద్రం వద్దకు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పుడు తీసుకొనే నిర్ణయం ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు అమలులో ఉండే అవకాశం ఉండటంతో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది.