తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కోయంబేడు మార్కెట్ కల్లోలం సృష్టిస్తోంది. దక్షిణాసియాలోనే అతి పెద్ద మార్కెట్‌గా దీనికి గుర్తింపు ఉంది. ఇప్పుడది కొవిడ్‌కు కేంద్రంగా మారింది. చెన్నై మహానగర శివారులో 297 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ వ్యాపార సముదాయం ద్వారా జరిగిన క్రయ, విక్రయాల నేపథ్యంలో వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. ఏప్రిల్30న మార్కెట్లోని రిటైల్ లావాదేవీలను ఆపేయగా..మే5న హోల్‌సేల్ వ్యాపారాన్ని నిలిపివేశారు. అయితే 11 నుంచి పాక్షికంగా టోకు వ్యాపారాన్ని ప్రారంభించారు. కేవలం దీని కేంద్రంగానే తమిళనాట సుమారు 2 వేలకు పైగా కేసులు.. మన రాష్ట్రంలో 60కుపైగా కేసులు నమోదయ్యాయి. ఒక్క చిత్తూరు జిల్లాలో 50 కేసుల వరకూ లెక్క తేలాయి. వివిధ జిల్లాల నుంచి సుమారు 2వేల మంది కోయంబేడుకు రాకపోకలు సాగించారని అంచనా.
పెద్ద సంఖ్యలో అక్కడికే:
రోజుకు లక్ష మంది రాకపోకలు..కోయంబేడు మార్కెట్లో పువ్వులు, కూరగాయలు, పండ్ల హోల్‌సేల్, రిటైల్ వ్యాపారం జరుగుతుంది. ఇందులో 2వేలు పెద్ద, 1,000 చిన్న దుకాణాలు ఉన్నాయి. 24 గంటలపాటు ఇక్కడ రద్దీ కనిపిస్తుంది. నిత్యం దాదాపు లక్ష మంది వరకు రాకపోకలు సాగిస్తుంటారు. తమిళనాడులోని జిల్లాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలోనే అక్కడకు వెళ్తుంటారు. రాష్ట్రం నుంచి ఆ మార్కెట్‌కు రాకపోకలు సాగించిన వారిలో.. ఇప్పటివరకు 1,500 మంది వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం.