తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో కాంగ్రెస్ (congress) అభ్యర్థి ఎంపికపై కసరత్తు దాదాపు పూర్తి కావొచ్చింది. అన్ని సామాజిక, ఆర్థిక సమీకరణాల దృష్ట్యా కొండా సురేఖ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైందని తెలుస్తోంది. సోనియా ఆమోదంతో ఒకట్రెండు రోజుల్లో కొండా సురేఖ పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. అభ్యర్థి ఎంపికపై ఎన్నికల కమిటీ ఛైర్మన్ దామెదర రాజనర్సింహ ఎస్సీ, బీసీ, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులను పేర్లతో పీసీసీ (PCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి నివేదిక ఇచ్చారు.
నివేదికతో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణికం ఠాగూర్ నేడు దిల్లీకి వెళ్లనున్నారు. అధిష్ఠానం పచ్చజెండా ఊపగానే అభ్యర్థి పేరు ప్రకటించనున్నారు. దామోదర రాజనర్సింహ ఇచ్చిన నివేదికలో కొండా సురేఖ (konda surekha) పేరు ఉన్నట్లుగా సమాచారం. హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. సోనియా ఆమోదంతో ఒకటి, రెండు రోజుల్లో కొండా సురేఖ పేరును ప్రకటించే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు వెల్లడించాయి.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కౌశిక్ రెడ్డి పోటీ చేశారు. అయితే మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో హుజూరాబాద్ టికెట్ తనకే వస్తుందని కౌశిక్ రెడ్డి ఓ కార్యకర్తతో ఫోన్‌లో జరిపిన సంభాషణ సంచలనం సృష్టించింది. మాదన్నపేటకు చెందిన విజయేందర్ అనే కార్యకర్తతో కౌశిక్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడుతూ.. హుజూరాబాద్ తెరాస టికెట్ తనకే ఖాయమైనట్లు చెప్పారు.