ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేడు దిల్లీకి రాజగోపాల్​రెడ్డి.. భవిష్యత్​ కార్యాచరణపై ఫోకస్

komatireddy rajagopal reddy delhi tour: ఇటీవల కాంగ్రెస్​కు రాజీనామా చేసిన తెలంగాణ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి నేడు దిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ భాజపా జాతీయ నేతలతో సమావేశం కానున్నారు. పార్టీలో చేరిక తేదీతోపాటు ఉప ఎన్నికకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

komatireddy rajagopal reddy delhi tour
రాజగోపాల్​రెడ్డి

By

Published : Aug 5, 2022, 1:43 PM IST

komatireddy rajagopal reddy delhi tour: కాంగ్రెస్ అధిష్ఠానానికి గురువారం తన రాజీనామా లేఖను పంపిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి.. భవిష్యత్​ కార్యాచరణకు వేగంగా అడుగులు వేస్తున్నారు. రెండేళ్లకు పైగా కాంగ్రెస్​ను వీడే విషయంలో సందిగ్ధంలో ఉన్న ఆయన.. సొంతపార్టీ తీరుపై విమర్శలు గుప్పిస్తూ.. భాజపాను పొగడ్తలతో ముంచెత్తుతూ వచ్చారు. రెండ్రోజుల క్రితం కాంగ్రెస్​ను వీడుతున్నట్లు ప్రకటించిన రాజగోపాల్.. ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేస్తానని ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ వేడి రగులుకుంది.

పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన వెంటనే కాంగ్రెస్​ నేతల విమర్శలపై ఎదురుదాడికి దిగిన రాజగోపాల్​రెడ్డి.. గురువారం తన రాజీనామా లేఖను సోనియాగాంధీకి పంపించారు. అదే సమయంలో తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ.. ఈ నెల 8న సభాపతి పోచారానికి లేఖను అందజేసే అవకాశముంది. హస్తం పార్టీని వీడటంతో.. భాజపాలో చేరటం లాంఛనమే అయిన నేపథ్యంలో ఇవాళ ఆయన దిల్లీకి వెళ్లనున్నారు. భాజపా జాతీయ నేతలతో సమావేశమై.. పార్టీలో చేరిక తేదీతో పాటు ఉప ఎన్నికకు సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశముందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్రంలో చాలా రోజులుగా నడుస్తోన్న మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి రాజీనామా ఎపిసోడ్​కు ఆగస్టు 2న ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్‌ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు స్వయంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. అయితే గురువారం రోజు.. కాంగ్రెస్​కు రాజీనామా చేస్తున్నట్లు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాకు రాజీనామా లేఖను పంపారు.

ఆ వ్యక్తి కింద పని చేయలేను.. అందుకే రాజీనామా..

'' 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో సుశిక్షితుడైన కార్యకర్తగా, ప్రజాప్రతినిధిగా మీ నాయకత్వంలో ఏ పని అప్పగించినా ఎక్కడ రాజీ పడకుండా కష్టాలు, కన్నీళ్లు దిగమింగుకుంటూ పార్టీ ప్రతిష్ట కోసం, కార్యకర్తలను కాపాడుకుంటూ ప్రస్థానం సాగించాను. కానీ గడిచిన కొంతకాలంగా పార్టీకి పూర్తి విధేయులైన వారిని అడుగడుగునా అవమానపరుస్తూ... విస్మరిస్తూ... పార్టీ ద్రోహులు... మీపైనే వ్యక్తిగత విమర్శలు చేసిన వ్యక్తులకు కీలక బాధ్యతలు అప్పగించటం నన్ను తీవ్రంగా బాధించింది. ఇప్పటికే అనేక పార్టీలు మార్చి, స్వలాభం కోసం ఓ ప్రజాప్రతినిధి చేయకూడని పనులు చేసి జైలు పాలైన వ్యక్తి ఆధ్వర్యంలో నేను కలిసి పనిచేయలేను.'' - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

''తెలంగాణ అంటేనే ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అన్న విషయం మీకు తెలియనది కాదు. 60 ఏళ్ల కలను సాకారం చేసుకునేందుకు అనేక వందల మంది ఆత్మబలిదానాలు చేసిన విషయం మీకు తెలిసిందే. అందరి చొరవతో సాకారమైన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయింది. ఈ బంధీ నుంచి విడిపించేందుకు తెలంగాణాలో మరో ప్రజాస్వామిక పోరాటం అవసరం ఉందని నేను నమ్ముతున్నా. అనేక జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించలేని వ్యక్తులు, గెలిచిన ఎమ్మెల్యేలలో మనోధైర్యం నింపి పోరాట కార్యాచరణ రూపొందించలేక కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేశారు. అందుకే సబ్బండవర్గాలు కోరుకున్న ప్రజా తెలంగాణలో, ప్రజాస్వామిక పాలన అందించే దిశగా మరో రాజకీయ పోరాటం చేయాలని నేను నిర్ణయించుకున్నా... ఈ దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచిన ఎమ్మెల్యే పదవితో పాటు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. దయచేసి ఆమోదించగలరు.'' - లేఖలో కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details