Komati reddy Venkat Reddy Said Did Not Participate Munugode Campaign: మునుగోడు ప్రచారానికి వెళ్లనని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. మునుగోడులో తనలాంటి హోంగార్డ్స్ ప్రచారం అవసరం లేదని.. ఎస్పీ స్థాయి వాళ్లే అక్కడ ప్రచారానికి వెళ్తారని పేర్కొన్నారు. గాంధీభవన్‌లోని కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఆయన తన ఓటును వినియోగించుకున్నారు. తనను విమర్శించే స్థాయి కడియం శ్రీహరికి లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
"మునుగోడుకు ఎస్పీలు పోతారు. హోంగార్డ్స్ పోరు. తనపై 100కేసులు పెట్టినా వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని తీసుకువస్తానని ఓ పెద్దమనిషి చెప్పారు. ఆయనే గెలిపించుకుంటారు. మోతలు మాట్లాడారు. అందుకే మేం దూరంగా ఉన్నాం." - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ ఎంపీ
ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికలను కాంగ్రెస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మిగతా ప్రధాన పార్టీల కంటే ముందే ప్రచారం చేపట్టింది. గత అనుభవాల దృష్ట్యా అభ్యర్థిని త్వరితంగానే ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక ప్రచార హోరు పెంచాల్సిన కాంగ్రెస్ కాస్త వెనుకపడింది. భాజపా, తెరాస రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని రంగంలోకి దించి జోరు పెంచితే అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.