Kolagatla Veerabhadraswamy: సభా గౌరవాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తానని కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. శాసనసభ ఉప సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయనను సోమవారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, తెదేపా శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు తదితరులు సాదరంగా తీసుకువెళ్లి సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా వీరభద్రస్వామి మాట్లాడుతూ.. ‘సభా కార్యక్రమాలను ప్రజలు గమనిస్తుంటారు. సభ గౌరవాన్ని పెంపొందించేలా ప్రవర్తించాలి’ అని సూచించారు.
‘సభలో ఉన్నంతవరకూ ఎలాంటి పక్షపాతం లేకుండా ఉంటా.. కానీ వైకాపా టికెట్ ఇవ్వబట్టే గెలిచి ఈ స్థానానికి వచ్చా కాబట్టి బయట రాజకీయవేత్తగానే కొనసాగుతా’ అని స్పష్టం చేశారు. ఎడమవైపు (ప్రతిపక్షం) చూడాలంటే.. సభ ఆసాంతం తమ స్థానాల్లో కూర్చుంటేనే చూడగలుగుతాం’ అని పేర్కొన్నారు. ‘సోమన్న అని పిలిచే వీరభద్రస్వామిని ఉపసభాపతి స్థానంలో కూర్చోపెట్టడం సంతోషాన్నిస్తోంది. ఆయన సభలో అందరికీ న్యాయం చేస్తారని ఆశిస్తున్నా’ అని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు.