రాజధాని ప్రాంతంలో నాలుగు భవనాలు, తుప్పలు, ముళ్ళ పొదలు తప్ప ఎమున్నాయని... చంద్రబాబు పర్యటన చేస్తారంటూ... మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. ఐదేళ్ళలో చంద్రబాబు... అమరావతి, పోలవరంపై సమీక్షలు చేయడం మినహా అభివృద్ధి పనులు చేయలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వ ప్రాధాన్యతల్లో రాజధానితో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలూ ఉన్నాయని స్పష్టం చేశారు. చంద్రబాబుకు ప్రజలు ఎందుకు ఓటు వేయలేదో ఇప్పటికైనా సమీక్షించుకోవాలని హితవు పలికారు.
'ఐదేళ్లలో కానిది... ఆర్నెళ్లలో అవుతుందా..?' - కొడాలి నాని తాజా సమాచారం
చంద్రబాబు అమరావతి పర్యటన ప్రకటనపై మంత్రి కొడాలి నాని స్పందించారు. రాష్ట్రంలో అమరావతి, పోలవరంపై సమీక్షలు మినహా... చంద్రబాబు ఏ పని చేయలేదని ధ్వజమెత్తారు.
రాష్ట్ర ప్రజలందరి సంక్షేమం తమకు అవసరమని నాని పేర్కొన్నారు. హైదరాబాద్ తరహా రాజధాని నిర్మిస్తామన్న చంద్రబాబు... 5 ఏళ్ల పాలనలో ఏమీ చెయ్యలేదని మండిపడ్డారు. ఆయన చేసిన పొరపాట్లు తమ ప్రభుత్వం చేయదన్నారు. 6 నెలల్లో ఇల్లే కట్టలేమని... అలాంటిది రాజధాని నిర్మాణం సాధ్యమా అని ప్రశ్నించారు. కొంత సమయం ఇచ్చిన తర్వాత స్పందించాలని పేర్కొన్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత రాజధాని ప్రాంతంలో శ్మశాన నిశ్శబ్దం ఉంటుందని... అందుకే మంత్రి బొత్స ఆ మాటలు అన్నారని సమర్ధించారు.