తెల్లరేషన్ కార్డులు మరుగున పడిపోయిన అంశమని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని స్పష్టంచేశారు. ఇక చౌకదుకాణాల్లో బియ్యం తీసుకునేందుకు బియ్యం కార్డులు జారీచేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి వెల్లడించారు. చౌకధరల దుకాణాల నుంచి బియ్యం తీసుకునేందుకు ఈ విధానం మెరుగైందని మంత్రి అన్నారు. నాణ్యమైన బియ్యాన్ని ప్యాకింగ్ చేసి.. బియ్యం కార్డుల ద్వారా అర్హులకు అందిస్తామన్నారు. నూతనంగా ప్రారంభించిన ఈ బియ్యం కార్డులతో ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాలేవీ ముడిపడిలేవని పేర్కొన్నారు.
అభ్యంతరాలు పునః పరిశీలన
వైఎస్సార్ నవశకం ద్వారా గ్రామ, వార్డు వాలంటీర్లు బియ్యం కార్డుల అర్హులను గుర్తించారని మంత్రి తెలిపారు. మొత్తం కోటీ 47 లక్షల 23 వేల 567 రేషన్ కార్డుల్లో 10 లక్షల మంది చౌకధరల దుకాణాల నుంచి బియ్యాన్ని తీసుకోవడం లేదని తెలిపారు. మరికొందరిని ప్రభుత్వం అనర్హులుగా గుర్తించిందన్నారు. మొత్తం 2.5 లక్షల మంది నుంచి పునః పరిశీలన కోసం అభ్యంతరాలను స్వీకరించామన్న మంత్రి.. పరిశీలన తర్వాత అర్హులైన వారికి కార్డులు జారీ చేస్తామని స్పష్టం చేశారు.