ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గాలిలోకి ఎగిరే సంక్రాంతి సంబరం

సికింద్రాబాద్​ పరేడ్​ మైదానంలో సంక్రాంతి శోభ కనువిందు చేస్తోంది. అంతర్జాతీయ పతంగుల పండుగ సందడిగా సాగుతోంది. అందమైన రంగు రంగుల పతంగులు ఎగురవేస్తూ... ఉత్సాహపూరితంగా కొనసాగుతోంది. అంబరం... సంబరం... కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. భారత్‌సహా 15 దేశాల నుంచి పతంగుల పండుగలో పాల్గొనేందుకు పోటీదారులు వచ్చాయి. దేశ, విదేశీ గాలి పటాలు తిలకించేందుకు జంట నగరవాసులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

kite-festival-at-secenderabad-pared-ground
kite-festival-at-secenderabad-pared-ground

By

Published : Jan 15, 2020, 8:27 AM IST

గాలిలోకి ఎగిరే సంక్రాంతి సంబరం

రంగు రంగుల పతంగులు ఆకాశంలో విహాంగాలై విహరించాయి. నోరూరించే మిఠాయిలు ఆహారప్రియులు, సందర్శకులను ఆహా అనిపిస్తున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో రాష్ట్ర పర్యటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పతంగుల పండగ కన్నుల పండువగా సాగుతోంది. సువిశాల పరేడ్ మైదానం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌సహా ఇతర రాష్ట్రాలు, వివిధ దేశాల సందర్శకులతో కళకళలాడిపోతోంది.దేశ, విదేశాలకు చెందిన పతంగులు హొయలు, వయ్యారాలు పలుకుతూ గాలి ఎగరడం చూసిన సందర్శకులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. తాను మొదటిసారిగా ఈ పతంగుల పండుగ తిలకించేందుకు వచ్చామని... అత్యంత అద్భుతంగా ఉందని సందర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్ని రకాల పతంగులో..

ప్రశాంతమైన వాతావరణం సికింద్రాబాద్ నడిబొడ్డున మైదానంలో ఆహ్లాదకరమైన గాలిలో నృత్యం చేస్తున్న కార్టూన్‌, చిరునవ్వు ఎమోజీ, టైగర్, డ్రాగన్‌, రాకాసి బల్లి, మొసలి, గుర్రం అందాలు చూస్తూ సందర్శకులు సంతోషంలో మునిగి తేలారు. అమీబా, పారాచ్యూట్‌, తాబేలు, కేరళ పేరిణి నృత్యం నమూనా, డాల్ఫిన్, త్రివర్ణ పతాకం, చిలుక, చింపాంజీ, గరుడ, పిల్లి, చేప పిల్ల లార్వా, భూచక్రం, చిత్రాలతో కూడిన భిన్న రకాల పతంగులు ఎంతో కనువిందు చేశాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఆ అందాలు తిలకించేందుకు పెద్ద సంఖ్యలో జంట నగరవాసులు పోటెత్తారు. సాయంత్రం పరేడ్ మైదానాకి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి సంతోషంగా గడుపుతున్నారు.

ఏటా కొత్తదనం:

విదేశాల నుంచి వచ్చిన కైట్ ప్రేమికులు పతంగులు ఎగరవేస్తూ... సంతోషంగా గడుపుతున్నారు. ఉన్నతమైన భారత్‌... ఘన చరిత్ర గల హైదరాబాద్ నగర సంస్కృతి, సాంప్రదాయాలు, భాగ్యనగరవాసుల మంచి తనం తమను కట్టిపడేసిందని విదేశీ క్రీడాకారులు అంటున్నారు. గత నాలుగేళ్లుగా అంతర్జాతీయ పతంగుల పండుగ వైభవంగా జరుగున్నా... ఏటేటా కూడా ఏదో కొత్తదనం సందర్శకులకు చేరవచేసే ప్రయత్నం పర్యటక శాఖ చేస్తుండటం ఒక ప్రత్యేకత అని చెప్పవచ్చు. ఈ సారి వినూత్నమైన రీతిలో... పర్యటకుల సౌకర్యం... తెలంగాణ పర్యటక శాఖ మంచి ఏర్పాట్లు చేసిందని దేశ, విదేశీ సందర్శకులు కృతజ్ఞతలు తెలియజేశారు.

కుతుబ్​షాహీ కాలం నుంచి..

కులీకుతుబ్‌షాల కాలం నుంచే పతంగుల పండుగ జరగడం అనవాయితీగా వస్తోంది. సాధారణంగా పతంగులకు పాత బస్తీ ప్రసిద్ధి. ఎక్కడో అమెరికా, జర్మనీ, శ్రీలంక, ఆస్ట్రేలియా లాంటి దేశాలు, గుజరాత్, మహారాష్ట్రలో జరుగుతుంటే వినడం తప్ప ఎప్పుడూ పతంగుల పండుగ చూడలేదని సందర్శకులు అంటున్నారు. భారత్‌సహా 15 దేశాల నుంచి 100 మందికి పైగా కైట్ క్రీడాకారులు తరలివచ్చి తమ అద్భుత ప్రతిభ చాటుతున్నారు. 15 ఏళ్లుగా తాను గుజరాత్‌లో జరిగే అంతర్జాతీయ పతంగుల పండుగలో పాల్గొంటున్నందున తెలంగాణ పర్యటక శాఖ తనను కన్సల్టెంట్‌గా నియమించిందని రాయల్‌ కైట్ ఫ్లైట్స్‌ క్లబ్ అధ్యక్షుడు పవన్ సోలంకి అన్నారు.

ఈ నెల 13న అట్టహాసంగా ప్రారంభమైన ఈ "అంతర్జాతీయ పతంగులు, మిఠాయిల పండుగ" బుధవారం సాయంత్రం ముగియనుంది. చివరి రోజు... సంక్రాంతి పర్వదినంకావడం వల్ల దేశంలో... పత్యేకించి తెలుగు రాష్ట్రాలు సహా హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల నుంచి పెద్దఎత్తున సందర్శకులు తరలివచ్చే అవకాశముంది.

ABOUT THE AUTHOR

...view details