మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయడంపై ఎంపీ, ఆయన అన్న కుమారుడు రామ్మోహన్ నాయుడు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం చట్టాన్ని ఉల్లంఘిస్తూ... శస్త్రచికిత్స చేయించుకున్న అచ్చెన్నాయుడిని వీల్ చైర్ మీద తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలంటే లెక్కలేకుండా కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. వైకాపా అరాచాకలపై పోరాడుతున్నందునే ఇలా దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ డైరెక్షన్లోనే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు.
'సీఎం జగన్ డైరెక్షన్లోనే అచ్చెన్నాయుడు వ్యవహరం జరుగుతోంది. ఉత్తరాంధ్రలో బలంగా ఉన్న తమ కుటుంబాన్ని దెబ్బతీసేందుకు ఇలాంటి కుట్ర పన్నారు. ఈఎస్ఐ స్కాంతో ఎలాంటి సంబంధం లేదని అచ్చెన్నాయుడు చెప్పారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసేందుకు డాక్టర్లపై అనిశా వాళ్లు ఒత్తిడి తెచ్చారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే నామమాత్రంగా చికిత్స అందించారని అర్థమవుతోంది. అచ్చెన్నాయుడు నిలబడలేని స్థితిలో ఉన్నా... జైలుకు తరలించారు. మంగళవారం చేసిన టెస్టుల ఫలితాలు ఇంకా రానేలేదు. అయినా హాస్పిటల్ నుంచి ఎలా డిశ్చార్జ్ చేశారు..? ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన నివేదికలు ఎవరికిచ్చారు..?'-కింజరాపు రామ్మోహన్ నాయుడు