సులభంగా డబ్బు సంపాదించేందుకు కొందరు అపహరణ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. నగరంలో సంపన్నులు, వ్యాపారులు, వారి కుటుంబసభ్యులను లక్ష్యంగా చేసుకుని కొన్నేళ్లుగా నేరాలకు పాల్పడుతున్నారు. పోలీసులకు చెబితే చంపేస్తామంటూ హెచ్చరిస్తుండటం వల్ల బాధితుల్లో కొందరు పోలీసులకు తెలియకుండా కిడ్నాపర్లు డిమాండ్ చేసిన డబ్బులు ఇస్తుండగా.. మరికొందరు ధైర్యంగా పోలీసులకు సమాచారం ఇస్తున్నారు. వారు నిందితులను పట్టుకుంటున్నా.. ఇలాంటి నేరాలు జరగడం మాత్రం ఆగడం లేదు.
దివికేగిన దీక్షిత్..
తెలంగాణలోని మహబూబాబాద్‌లో చిన్నారి దీక్షిత్‌ను అపహరించిన నందసాగర్.. పిల్లాడిని కిరాతకంగా హత్యచేశాడు. ఈ తరహా నేరాలు భాగ్యనగరంలోనూ జరుగుతున్నాయి. అపహరణకు గురైన కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు స్పందించి నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
వారం రోజుల్లోగా రూ.4కోట్లు.
హైదరాబాద్‌లోని కొంపల్లిలో నివాసముంటున్న ఎస్.రామకృష్ణరాజు నాచారం పారిశ్రామికవాడలో రసాయన పరిశ్రమ నిర్వహిస్తున్నారు. ఆయన నుంచి కోట్లు దండుకోవచ్చన్న ఆలోచనతో డి.హరిప్రసాద్ అనే నిందితుడు తన స్నేహితులు మోహన్, శ్యాం, వరప్రసాద్, సంజీవ్, రాజశేఖర్‌లతో కలిసి ఆగస్టు 27న రామకృష్ణరాజును అపహరించి.. మేడ్చల్ లోని ఓ గదిలో బంధించారు. రూ.4 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించారు. తనవద్ద డబ్బు లేదని వారం రోజులు సమయం కావాలని కోరగా... బీకాంప్లెక్స్ మందును సిరంజీ ద్వారా శరీరంలోకి పంపించారు. అది విషమని.. వారం రోజుల్లో డబ్బు ఇస్తే.. విరుగుడు మందు ఇస్తామని..లేదంటే చస్తావని హెచ్చరించారు. ఆయన పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆరుగురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు.
హత్య చేసి గోనెసంచిలో మృతదేహం
ఇదే ఏడాది ఫిబ్రవరి 2న జూబ్లీహిల్స్‌లో ఉంటున్న చేపల వ్యాపారి రమేశ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. రమేశ్ చరవాణి పని చేయకపోవడం.. అతడు ఇంటికి రాకపోవడం వల్ల ఆయన కుటుంబసభ్యులు ఎస్.ఆర్.నగర్ పోలీసులకు అదృశ్యం అయినట్లు ఫిర్యాదు చేశారు. అనంతరం కిడ్నాపర్ ఫోన్ చేసి.. రూ.90లక్షలు ఇస్తే.. రమేశ్‌ను వదిలేస్తామని హెచ్చరించారు. పోలీసులు పరిశోధన చేస్తుండగానే.. జవహార్ నగర్‌లోని ఓ ఇంట్లో రమేశ్‌ను హత్యచేసి గోనెసంచిలో మృతదేహాన్ని ఉంచి కిడ్నాపర్లు పారిపోయారు. అనంతరం పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.