Three people died: తెలంగాణలోని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుర్దేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ఏట్లో గల్లంతవగా.. గాలించడానికి వచ్చిన సహాయక సిబ్బందిలో ఒకరు నీట మునిగి మృతి చెందారు. మరొకరు గల్లంతయ్యారు. సుర్దేపల్లిలో గ్రామంలో పాలేరు ఏటిపైనున్న చెక్‌డ్యాం కమ్ బ్రిడ్జి వద్ద గురువారం ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. బ్రిడ్జి వద్ద చేపలు పట్టేందుకు.. అదే మండలంలోని చెన్నారం గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు గురువారం ఉదయం 5 గంటలకు వచ్చారు.
వీరిలో అఫ్జల్, పగడాల రంజిత్(26)లు చేపలు పడుతూ ప్రమాదవశాత్తూ నీటిలో కొట్టుకుపోయారు. అఫ్జల్‌ను అక్కడ ఉన్న స్థానిక జాలరి ఒకరు క్షేమంగా పైకి లాగారు. నీటిలో మునిగిన రంజిత్ కోసం స్థానికులు, బంధువులు గాలించారు. సాయంత్రం 4 గంటలకు స్థానిక ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి సూచనతో మండలాధికారులు ఖమ్మం మున్సిపాలిటీకి చెందిన డీఆర్ఎఫ్ బృందాన్ని పిలిపించారు. నలుగురితో కూడిన ఈ బృందం గల్లంతైన రంజిత్ కోసం గాలింపు చేపట్టింది.