గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహాగణపతి khairatabad ganesh immersion 2022: తెలంగాణలో ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జన శోభాయాత్ర.. భక్త జన సందోహం మధ్య ఘనంగా జరిగింది. ప్రతి ఏడాది ఒక్కో ప్రత్యేక రూపంలో దర్శనమిచ్చే విఘ్నేశ్వరుడు.. ఈ ఏడాది శ్రీ పంచముఖ లక్ష్మీ మహా గణపతి రూపంలో కనువిందు చేశాడు. కుడివైపున శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి, ఎడమవైపున శ్రీ త్రిశక్తి మహా గాయత్రీదేవి భక్తులకు దర్శనమిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ స్థానంలో శిల్పి రాజేందర్ నేతృత్వంలో ఈసారి రూపొందించిన 50 అడుగుల మట్టి విగ్రహం విశేషంగా ఆకట్టుకుంది. ఏటా 40 టన్నుల బరువులోపే ఉండే మహా గణపతి.. మట్టితో తయారు చేయడం వల్ల ఈసారి 70 టన్నులకు చేరింది.
ఉదయం ప్రత్యేక పూజలు..: గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చేందుకు గురువారం అర్ధరాత్రి నుంచే ఏర్పాట్లు చేశారు. 70 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో ఉన్న 26 టైర్ల ప్రత్యేక వాహనంపైకి మహాగణనాథుడి విగ్రహాన్ని ఎక్కించారు. కదలకుండా ఉండేందుకు వెల్డింగ్ పనులు చేపట్టారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ మండపం వద్ద పూజలు చేశారు. అనంతరం శోభాయాత్ర ప్రారంభమైంది.
కనులారా తిలకించి.. మనసారా పులకరించి..: ఖైరతాబాద్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు.. దారిపొడువునా భక్తుల కోలాహలం మధ్య మహా గణపతి శోభాయాత్ర సాగింది. గణపతి బప్పా మోరియా నినాదాలతో పరిసర ప్రాంతాలు మారుమోగాయి. ఖైరతాబాద్ గణనాథుడిని చూసేందుకు జనం తాండోపతండాలుగా తరలివచ్చారు. 50 అడుగుల ఎత్తైన మట్టి విగ్రహాన్ని కనులారా తిలకించి.. పులకరించిపోయారు.
ఊపిరి పీల్చుకున్న అధికారులు: శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. మహా సంద్రాన్ని తలపించే భక్త సమూహం.. పార్వతీ తనయుడిని గంగమ్మ ఒడికి చేరే వరకూ కదిలొచ్చింది. దారి పొడవునా భక్తులు లంబోదరుడికి నీరాజనాలు పలికారు. ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నంబర్ 4 వద్ద ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం చేశారు. వెళ్లిరా గణపయ్య.. మళ్లీ రావయ్యా అంటూ గణేశుడిని భక్తులు సాగనంపారు. మహా గణపతి ప్రశాంతంగా గంగమ్మ ఒడికి చేరడంతో.. పోలీసులు, జీహెచ్ఎంసీ సహా వివిధ విభాగాల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చూడండి..