మూడు రాజధానులు ఉండవచ్చు అని సీఎం చేసిన వ్యాఖ్యలు అమరావతికి భూములిచ్చిన రైతుల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రభుత్వంపై నమ్మకంతో రాజధానికి రైతులు భూములిచ్చారని గుర్తు చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధానిపై విస్పష్ట ప్రకటనలు చేస్తోందని విమర్శించారు. ఫలితంగా.. అమరావతి ప్రాంత రైతుల్లో భయం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో రైతుల్లో మనోధైర్యం నింపుతూ అండగా ఉండేందుకు జనసేన ముందుకెళ్తోందని పవన్ వెల్లడించారు. పార్టీ సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో నాయకులను రైతుల వద్దకు పంపిస్తున్నామని తెలిపారు. రాజధానిపై నిపుణుల కమిటీ నివేదిక వచ్చే వరకు సంయమనంతో ఉండాలని అమరావతి ప్రాంత ప్రజలకు పవన్ పిలుపునిచ్చారు. నివేదికలో పొందుపరిచిన అంశాల ఆధారంగా స్పందిద్దామని జనసైనికులకు సూచించారు.