ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

KCR: తెలంగాణలో వచ్చే నెల నుంచే కొత్త పింఛన్లు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ రాజన్న సిరిసిల్ల జిల్లాపై వరాల జల్లు కురిపించారు. కోట్లాది రూపాయలతో నిర్మించిన పలు భవనాలు ప్రారంభించారు. రెండు పడక గదుల ఇళ్లు, నర్సింగ్ కళాశాల, కొత్త కలెక్టరేట్ భవనం, మార్కెట్ యార్డ్ సముదాయాన్ని ప్రారంభించిన సీఎం.. రాబోయే రోజుల్లో సిరిసిల్లను మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు సాగునీరందించే మల్కపేట రిజర్వాయర్ పనులపై సమీక్ష నిర్వహించారు.

kcr-tour
kcr-tour

By

Published : Jul 5, 2021, 10:48 AM IST

పాలనే సాధ్యం కాదన్న చోట సంస్కరణలు పుట్టుకొచ్చాయని. కరవును చూసి కన్నీళ్లుపెట్టుకున్న కళ్లకే పుష్కలంగా నీళ్లు కనిపిస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు వచ్చే నెల నుంచి 57 ఏళ్లు నిండిన వారిలో అర్హులకు వృద్ధాప్య పింఛన్లు ఇవ్వనున్నామన్నారు. గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా.. ఏవిధంగా అయితే రూ.5 లక్షల రైతు బీమా అందిస్తున్నామో.. ఇక మీద చేనేత కార్మికులకూ అలాగే రూ.5 లక్షల చేనేత బీమా ఇవ్వబోతున్నామని చెప్పారు. రాబోయే రెండు నెలల్లో దీన్ని అమలు చేసేలా ముందుకెళ్తామన్నారు. చేనేతల విషయంలో కొంత కార్పస్‌ ఫండ్‌ పెట్టి వారికి మంచి చేయాలని ఆలోచిస్తున్నామన్నారు. ఆదివారం సిరిసిల్ల జిల్లాలోని కొత్తకలెక్టరేట్ను ప్రారంభించి.. అధికారులు, ప్రజాప్రతినిధుల్ని ఉద్దేశించి సీఎం మాట్లాడారు. సిరిసిల్లజిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో 1,320 రెండు పడక గదుల ఇళ్లు, ఐడీటీఆర్‌ (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డ్రైవింగ్‌ అండ్‌ ట్రైనింగ్‌ రీసెర్చ్‌) కేంద్రాన్ని, మార్కెట్ యార్డు, నర్సింగ్‌ కళాశాలలను మంత్రి కేటీఆర్‌తో కలిసి ప్రారంభించి ప్రసంగించారు.

ఎవరూ ఆపలేరు

‘ఈ సిరిసిల్ల వేదిక నుంచి మరొక్కసారి చెబుతున్నా... ప్రజల దీవెన, ఆశీర్వాదం ఉన్నంత కాలం కేసీఆర్‌ ప్రారంభించిన ప్రయాణాన్ని.. ప్రస్థానాన్ని ఎవరూ ఆపలేరు. ఇక్కడే ఉన్న వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి జిల్లాలో ఒకనాడు 85 వేల ఎకరాలకు నీళ్లందించే ఆర్డీఎస్‌, దాని తూములను కూడా సమైక్యపాలకుల కనుసన్నల్లోనే బాంబులు పెట్టి పగులగొడితే.. 2002లో అనుకుంటా. ఉద్యమం ప్రారంభమైన కొద్ది నెలలకే అమ్మవారికి దండం పెట్టి గద్వాల వరకు పాదయాత్ర చేశాం. కొన్ని చోట్ల కాలువల దుస్థితి చూసి కన్నీళ్లొచ్చాయి. ఇదే నిరంజన్‌రెడ్డి హయాంలో ఈ సంవత్సరం పండిన పంటలో 92 లక్షల మెట్రిక్‌ టన్నుల పైచిలుకు ధాన్యాన్ని ఎఫ్‌సీఐకి ఇచ్చాం. ఇది కథ కాదు. నిజంగా తెలంగాణలో జరిగింది. నా పర్యటనలో ఎటు చూసినా వరంగల్‌ సహా పలుచోట్ల ధాన్యపు రాశులు కనపడుతున్నాయి. గత ఆరేడేండ్లలో వ్యవసాయం విషయంలో ఒక అద్భుతం జరిగింది. వలస పోయిన రైతులు ఊళ్లకు వాపస్‌ వస్తున్నారు.

కాకతీయ నుంచి కాళేశ్వరం దాకా..

తెలంగాణ తనను తాను పునర్నిర్మించుకునే క్రమంలో మిషన్‌ కాకతీయ నుంచి కాళేశ్వరం వరకు సజీవ జలధారల దృశ్యాల్ని సాక్షాత్కరించుకుంటోంది. కాళేశ్వరం విషయంలో ఓ ఆంగ్ల ఛానల్‌ వాళ్లు ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీస్టేజ్ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ అని చూపించారు. కొందరు మన మీద అపవాదులు పెట్టారు. ఒకసారి ప్రధాన మంత్రి కూడా అంటేె ఆయనతో పంచాయితీ పెట్టుకున్నా. ‘ఆప్‌ కే తెలంగాణకే లియే.. పాంచ్‌ సౌ.. చేె సౌ మీటర్‌ పానీ ఉఠానా పడ్తానా..?’ అని అడిగితే అది తప్పని చెప్పా. మాకు 50 మీటర్లు, 100 మీటర్లు, 200 మీటర్లు పారే ఎత్తిపోతలున్నాయని వివరించా. గోదావరి బెడ్‌ మీద తీసుకునేది 90 మీటర్లు. ఇవ్వాళ మిడ్‌ మానేరు వద్ద 318 మీటర్లు. అంటే సుమారు 200పై చిలుకు మీటర్లే ఎత్తిపోస్తున్నాం. ఇక్కడి నుంచే 40 లక్షల ఎకరాలు పారుతుంది. ఇప్పుడు కూడా కొన్ని పేపర్లు గింత కరెంట్ అవసరమా..? అని రాస్తున్నాయి. ఏడు వేలని ఒకడు.. మూడు వేలని ఇంకొకడు అంటాడు. రూ.10వేల కోట్లయినా.. రూ.15 వేల కోట్లయినా కడతా. ఖమ్మం జిల్లాకు 130 మీటర్లు ఎత్తిపోస్తే జిల్లా అంతా పారతది. ఎక్కడ నీళ్లున్నయని వెతికిన చోటనే ఇప్పుడు 180 కి.మీ. మేర గోదారి సజీవమైంది. మహబూబ్‌నగర్‌లో 11 లక్షల ఎకరాలను పచ్చగా మార్చినాం. ఖమ్మంలో సీతారామ ప్రాజెక్ట్‌తో పాటు కాళేశ్వరంలోని కొన్ని ఎత్తిపోతల్ని త్వరలో పూర్తిచేస్తాం. నేను సిద్దిపేటలో డిగ్రీ చేసేటప్పుడు ఇల్లంతకుంటలో నాకు 50 మంది దాక దోస్తులుండె. వాళ్ల దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడి కరవును కళ్లార చూసి ఏడ్చిన. ఇప్పుడు అదే ప్రాంతంలో తల మీద పోసుకునేటట్లు నీళ్లొచ్చాయి. మంచి నీళ్ల గోసను మిషన్‌ భగీరథతో తీర్చుకున్నం.సిరిసిల్ల జిల్లాలో మెడికల్‌ కళాశాలను వచ్చే ఏడాదిలో ఏర్పాటు చేస్తాం. మధ్యమానేరు బ్యాక్‌వాటర్‌ చెంతన 243 ఎకరాలు.. అన్నపూర్ణ జలాశయం సమీపంలో 240 ఎకరాల ప్రభుత్వ భూమిని దేశంలోనే ఆదర్శ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సూచిస్తున్నా. రాబోయే 3, 4 సంవత్సరాల్లో దళితుల అభ్యున్నతి కోసం రూ.45వేల కోట్లను ఖర్చు చేయబోతున్నాం.

రూ.1500 నుంచి 5000కు ఉపకార వేతనాల పెంపు

సిరిసిల్లలో నర్సింగ్‌ కళాశాల ప్రారంభ సమయంలో ఉపకార వేతనాల్ని పెంచాలని నర్సులు కోరారు. ఇప్పటి వరకు వారికి కేవలం రూ.1,500, రూ.1,700, రూ.1,900 ఆయా కేటగిరీ వారీగా ఉపకార వేతనాలు అందుతున్నాయని గోడు వెలిబుచ్చారు. ఇకపై వారికి మొదటి సంవత్సరానికి రూ.1,500 నుంచి రూ.5 వేలకు పెంచుతున్నాం. రెండో సంవత్సరం వారికి రూ.1,700 స్థానంలో రూ.6వేలు ఇస్తాం. మూడో సంవత్సరం వారికి రూ.1,900కు బదులుగా రూ.7వేలు అందిస్తాం.

మిడతల బెడదను అడ్డుకున్నాం..

ఎక్కడి నుంచి వచ్చిందో ఈ కరోనా దయ్యం.. మనల్ని అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టింది. భవిష్యత్తులో ఏరకమైన వైరస్‌లు వచ్చినా.. ఎదుర్కొనేలా రూ.10వేల కోట్లతో వైద్య సంబంధిత వసతులను మెరుగు పర్చాలని నిర్ణయించాం. ఇక మిడతల బెడదను రాష్ట్రానికి రాకుండా అడ్డుకున్నాం. హరియాణా, ఛత్తీస్‌గఢ్‌ల వరకు రాగానే మన యంత్రాంగం అప్రమత్తమైంది. మహాకవి శ్రీనాథుడు కూడా తనకు మిడతల వల్ల ఎదురైన ఇబ్బందిని పద్యం రూపంలో చెప్పాడు. ‘బిలబిలాక్షులు తినిపోయే తిలలు పెసలు.. కృష్ణవేణమ్మ కొనిపోయె కొత్త పెసలు.. ఎట్లు చెల్లిస్తు టంకంబులు ఏడు నూర్లు’.. అని బాధపడిన సందర్భాలున్నాయి. అందుకే ప్రకృతి ప్రకోపానికి మనం గురికాకుండా జాగ్రత్తగా మెలగాలి. కరోనా వేళ వీరోచిత సేవలందించిన వారందరికి మరోసారి సెల్యూట్ చేస్తున్నా.

ఇదీ చదవండి:WATER DISPUTE: తెలంగాణ విద్యుదుత్పత్తిపై హైకోర్టుకు ఏపీ రైతులు

ABOUT THE AUTHOR

...view details