KCR Speech on TS Liberation Day : జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17 సందర్భాన్ని వక్రీకరించి, తమ సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే నీచమైన ఎత్తుగడలను తిప్పికొట్టాలని ముఖ్యంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. పబ్లిక్ గార్డెన్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అమరవీరుల స్మారకం వద్ద నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
KCR Speech on Telangana Liberation Day : "ప్రజలందరికీ తెలంగాణ జాతీయ సమైక్యతదినోత్సవం శుభాకాంక్షలు. 1948 సెప్టెంబర్ 17న సువిశాల భారత్‌లో హైదరాబాద్ రాష్ట్రం విలీనమైంది. స్వాతంత్య్రానికి పూర్వం భారతదేశంలోని అనేక ప్రాంతాలు వేర్వేరు పాలకుల చేతుల్లో ఉండేవి. ఆనాడు స్వదేశీ సంస్థానాలు వేర్వేరు సమయాల్లో భారత్‌లో విలీనం అయ్యాయి. ఆనాడు ప్రజా పోరాటాలు చేసిన మహనీయులందరినీ స్మరించుకుందాం. అందరి కృషితోనే నేడు మనం చూస్తున్న భారతదేశం ఆవిష్కృతమైంది. మతాలకు అతీతంగా దేశ సమైక్యతకు కృషి జరిగింది. స్వాంతంత్య్రానికి పూర్వమే హైదరాబాద్ రాష్ట్రం ఎంతో అభివృద్ధిలో ఉండేది. రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ పేరిట హైదరాబాద్ రాష్ట్రాన్ని బలవంతంగా ఏపీతో కలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనంపై హైదరాబాద్ ప్రజలు అప్పుడే ఆందోళన చెందారు. సుదీర్ఘ పోరాటం తర్వాత మళ్లీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది." అని కేసీఆర్ ఉద్ఘాటించారు.