KCR National Party: జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టేందుకు గులాబీ దళపతి కేసీఆర్ చేస్తున్న సుదీర్ఘ కసరత్తు కొలిక్కి వచ్చింది. విజయదశమి రోజు జాతీయ రాజకీయ పార్టీ ప్రకటించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబరు 5న దసరారోజున తెరాస విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి జాతీయపార్టీ విధివిధానాలపై చర్చించనున్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని కేసీఆర్‌ను కోరుతూ తీర్మానం చేయనున్నారు. జాతీయపార్టీ ఏర్పాటుపై కొద్దికాలంగా వివిధఅంశాలపై కేసీఆర్ విస్తృతసమాలోచన చేస్తున్నారు.
జెండా, అజెండాపై క్లారిటీ: ఈ మేరకు వారంరోజులుగా ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు, దళితులు, కార్మిక సంఘాలు, విశ్రాంత అధికారులతో చర్చలు జరిపారు. జాతీయ పార్టీ జెండా, అజెండాపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. భాజపా, కాంగ్రెస్ రెండింటికీ సమదూరం పాటిస్తూ స్పష్టమైన అజెండాతో ప్రజల ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ప్రజల్లో భాజపాపై తీవ్ర అసంతృప్తి ఉందని కాంగ్రెస్ నాయకత్వంపై విశ్వాసం లేనందున జాతీయ పార్టీ ఏర్పాటుకు ఇదేసరైన సమయమని తెరాస అధినేత గట్టిగా నమ్ముతున్నారు.
ఆ రెండు పార్టీలకు దూరం: ఇతరపార్టీలు ఇప్పటికిప్పుడు కలిసి రాకపోయినా భవిష్యత్తులో కచ్చితంగా జతకలుస్తాయని తెరాస నేతలు భావిస్తున్నారు. ముందుగా జాతీయ రాజకీయాలపై ప్రకటన చేసి ప్రజల్లోకి వెళ్లడమే మంచిదని కేసీఆర్ భావిస్తున్నారు. భాజపా, కాంగ్రెస్‌కి సమదూరమనే సంకేతం స్పష్టంగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నారు. కొన్ని పార్టీలు భాజపాను వ్యతిరేకిస్తున్నా కాంగ్రెస్‌కు అనుకూల వైఖరితో ఉన్నందున.. ప్రస్తుతానికి వాటికి దూరంగా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారు. జేడీఎస్ వంటి కొన్ని పార్టీలు తమ వెంట కలిసి వస్తాయని గులాబీ బృందం విశ్వసిస్తోంది. కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ట్విటర్ వేదికగా ఇటీవలే ప్రకటించారు.