ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జాతీయ రాజకీయాల్లోకి 'కారు'.. వేగం ఏమాత్రం తగ్గకుండా గట్టి ప్రణాళికలు.. - తెలంగాణ తాజా రాజకీయాలు

KCR National Party: జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టేందుకు గులాబీ దళం సిద్ధమైంది. కొత్తగా పార్టీ పెట్టకుండా.. ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలోని ప్రాంతీయ పార్టీనే ఇతర రాష్ట్రాల్లోనూ పోటీ చేయనుంది. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి పేరును ఇతర రాష్ట్రాల్లో ఆమోదించలేరు కాబట్టి.. భారత రాష్ట్రీయ సమితిగా మార్చనున్నారు. దసరా రోజున ముహూర్తం ఖరారు చేసిన కేసీఆర్ రాష్ట్రంలో కారు వేగంపై ప్రభావం పడకుండా జాగ్రత్త పడుతున్నారు. దిల్లీలో సభతో ప్రారంభించి దేశవ్యాప్తంగా ప్రచారానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్న కేసీఆర్ పర్యటనల కోసం ప్రత్యేక విమానం కొనుగోలు చేస్తున్నారు.

KCR National Party
KCR National Party

By

Published : Oct 3, 2022, 11:19 AM IST

జాతీయ రాజకీయాల్లోకి 'కారు'.. వేగం ఏమాత్రం తగ్గకుండా గట్టి ప్రణాళికలు..

KCR clarity on National Party: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఉవ్విళ్లూరుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కసరత్తు కొలిక్కి వచ్చింది. దేశంలో గుణాత్మక మార్పు కోసం తాను జాతీయ రాజకీయాల వైపు వెళ్లనున్నట్లు కేసీఆర్ కొంతకాలంగా స్పష్టంగానే చెబుతున్నారు. అయితే ఏ రూపంలో వెళ్లబోతున్నారనే అంశంపై సొంత పార్టీ శ్రేణుల్లోనూ ఇప్పటి వరకు కొంత గందరగోళమే ఉంది. కేసీఆర్ వివిధ రాష్ట్రాల్లో నేతలను కలవడంతో.. ప్రాంతీయ పార్టీల కూటమికి ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరిగింది.

జాతీయ స్థాయిలో కొత్త పార్టీపై తర్జన భర్జన:మరో సందర్భంలో దేశవ్యాప్తంగా ప్రజలనే నేరుగా కదిలిస్తామనడంతో.. జాతీయ స్థాయిలో కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు మరో ప్రచారమూ జరిగింది. జాతీయ స్థాయిలో కొత్తగా పార్టీ ఏర్పాటు చేసి.. రాష్ట్రంలో తెరాసను కొనసాగించాలా లేక జాతీయ పార్టీ ఏర్పాటు చేసి తెరాసను అందులో విలీనం చేయాలా లేదా తెరాసనే పేరు మార్చి జాతీయ పార్టీగా రూపాంతరం చేయాలా అనే అంశంలో కొంతకాలంగా తర్జన భర్జన జరిగింది. రెండు వేర్వేరు పార్టీలు ఉంటే రాష్ట్రంలో గందరగోళం ఏర్పడుతుందని.. తెరాస పేరుతో వెళితే ఇతర రాష్ట్రాల్లో ఆదరణ ఉండదనే అభిప్రాయాలు వచ్చాయి.

చివరకు తెరాస ప్రాంతీయ పార్టీ పేరునే మార్చి దేశవ్యాప్తంగా పోటీ చేయాలనే వ్యూహాన్ని ఖరారు చేశారు. కొత్తగా పార్టీ పెడితే కారు గుర్తు ఉండక పోవచ్చు.. కానీ పార్టీకే పేరు మార్చడం వల్ల గుర్తు మారే సమస్య తలెత్తదని కేసీఆర్ ఆలోచన. ఆమ్‌ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఎన్​సీపీ తదితర పార్టీల తరహాలో ఇతర రాష్ట్రాల్లోనూ పోటీ చేసి ప్రభావం చూపాలని కేసీఆర్ ప్రణాళికలు చేశారు. ఈసీ నిబంధనల మేరకు దేశవ్యాప్తంగా ఓట్లు, సీట్లు సాధించి.. భారాసకు జాతీయ పార్టీగా గుర్తింపు సాధించాలని వ్యూహం.

దసరా రోజు తెరాస కార్యవర్గం తీర్మానం: దసరా రోజున మద్యాహ్నం ఒంటిగంట 19 నిముషాలకు పార్టీ పేరును భారాసగా మారుస్తూ తెరాస విస్తృతస్థాయి కార్యవర్గం తీర్మానం చేయనుంది. ఈనెల 6న తెరాస పేరును భారాసగా మార్చాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరుతూ దరఖాస్తు చేయనున్నారు. ఈసీ ఆమోదం రాగానే... గులాబీ జెండా, కారు గుర్తుతో దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేసేందుకుకేసీఆర్ సిద్ధమవుతున్నారు. దిల్లీలో డిసెంబరు 9న భారీ బహిరంగ సభ నిర్వహించాలని గులాబీ దళపతి సిద్ధమయ్యారు.

విమానం కొనుగోలుకు ప్రత్యేక విరాళాలు సేకరణ: భారాసకు ఇప్పుడైతే తెరాస ప్రస్తుత కార్యవర్గమే కొనసాగనుంది. ఆ తర్వాత రాష్ట్రాల వారీగా కోఆర్డినేటర్లను నియమించాలని భావిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లోని చిన్న చిన్న పార్టీలను భారాసలో విలీనం చేసేందుకు ఇప్పటికే కసరత్తు జరిగింది. భారాస పేరుతో జాతీయ రాజకీయాల్లో దూసుకెళ్లాలని భావిస్తున్న కేసీఆర్ దేశవ్యాప్త పర్యటనల కోసం ప్రత్యేకంగా విమానం కొనుగోలు చేయాలని నిర్ణయించారు. 12 సీట్ల ఛార్టర్ ఫ్లయిట్ కోసం ఇప్పటికే అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విమానం కొనుగోలు కోసం తెరాస నిధులతో పాటు ప్రత్యేకంగా విరాళాలను సేకరించనున్నారు.

గుజరాత్‌ మోడల్‌ విఫలమైంది.. తెలంగాణ మోడల్‌ కావాలి: రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, బిహార్ తదితర రాష్ట్రాల్లో భారాస అభ్యర్థులను నిలబెట్టాలని ఆలోచిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లోని ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని.. వీలుకాకపోతే ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం తరహాలోనే నేరుగా ప్రజలను కదిలిస్తే.. ఇతర పార్టీలు, నాయకులు కలిసొస్తారనికేసీఆర్ బలంగా నమ్ముతున్నారు. గుజరాత్‌ మోడల్‌ విఫలమైందని.. తెలంగాణ మోడల్‌ కావాలనే నినాదంతో భారాస ముందుకెళ్లనుంది.

తెలంగాణలోని దళితబంధు, ఆసరా ఫించన్లు, రైతుబంధు, రైతుబీమా, కళ్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాలు.. సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, నిరంతర విద్యుత్తు వంటివి విస్తృతంగా ప్రచారం చేసి.. భారాసకు మద్దతుగా నిలిస్తే దేశమంతా చేసి చూపిస్తామనే ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details