ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 3, 2021, 4:53 AM IST

ETV Bharat / city

KCR PROMISE: సీమకు నీరెళ్లేలా కేసీఆరే చూస్తానన్నారు: సజ్జల

పెద్దన్నలా తాను ముందుండి రాయలసీమకు నీరు వెళ్లేలా చూస్తానని గతంలో కేసీఆర్​ ఇచ్చిన మాటను(KCR PROMISE).. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలు సరికాదని అన్నారు. ఏపీకి కేటాయించిన నీటి వాటాకు లోబడే వివిధ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందని మంత్రి అనిల్​ కుమార్​ యాదవ్​ తెలిపారు. వాస్తవాలను పరిగణలోకి తీసుకుని తెలంగాణ తమకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

KCR PROMISE
సీమకు నీరెళ్లేలా కేసీఆరే చూస్తానన్నారు

‘నేను పెద్దన్నలా ముందుండి రాయలసీమకు నీరు వెళ్లేలా చూస్తా’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR) గతంలో హామీ ఇచ్చారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఇప్పుడు తెలంగాణ మంత్రులే దానికి మరో రకంగా భాష్యం చెబుతూ ఏపీపై వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. వివాదం సానుకూలంగా పరిష్కారం కావాలనే ఉద్దేశంతోనే తెలంగాణవారికి విజ్ఞప్తి చేశామన్నారు. చివరికి ఇప్పుడు ప్రధానికి లేఖ రాశామని తెలిపారు. శుక్రవారం సజ్జల(SAJJALA) తాడేపల్లిలో విలేకర్లతో మాట్లాడారు.

రిజర్వాయర్​ కు వచ్చిన నీరు వచ్చినట్లే పోతోంది..

‘శ్రీశైలానికి వస్తున్న వరద తగ్గింది. ఒక్కోసారి ఏడాదికి 600 టీఎంసీలు కూడా వచ్చే పరిస్థితి ఉండటం లేదు. అందువల్ల తక్కువ సమయంలో ఎక్కువ నీటిని తీసుకుని నిల్వ చేసుకోవడమే పరిష్కారం. ఆ దిశగానే ముఖ్యమంత్రి జగన్‌ ప్రయత్నిస్తున్నారు. ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో దీనికి కేసీఆర్‌ అంగీకరించడంతోపాటు ఆ దిశగా అడుగులు వేసేందుకు కూడా ప్రోత్సహించారు. ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మాట మార్చారనే మాటలు తెలంగాణ మంత్రుల నుంచి వస్తున్నాయంటే అవి కేసీఆర్‌ దృష్టికి వెళ్లాయా? ఆయన ఆదేశాలతోనే వారు మాట్లాడారా? అనేది తెలియదు. రాయలసీమ అవస్థలు మాకు తెలుసు.. దానికి శాశ్వత పరిష్కారం చూపడంలో నేను ముందుంటా అని అప్పుడు కేసీఆర్‌ అన్నారు. దాని ప్రకారమే మనవైపు కాల్వల వెడల్పు కోసం నమూనాలను సిద్ధం చేసుకోవడం మొదలుపెట్టాం. ఎత్తిపోతల పథకానికీ అనుమతి కోరాం. మనమేమీ రహస్యంగా చేయడం లేదు. దానికి ఇప్పుడు తెలంగాణ మంత్రులు ఇంకో రకమైన భాష్యం చెబుతున్నారు. శ్రీశైలంలో 834 అడుగులపైన నీరున్నప్పుడు విద్యుదుత్పత్తి చేపట్టాలి. 800 అడుగుల్లోపే తెలంగాణ విద్యుదుత్పత్తి మొదలుపెట్టడంతో రిజర్వాయరుకు వచ్చిన నీరు వచ్చినట్లే పోతోంది. ఒకరకంగా జలవిపత్తు ఏర్పడే పరిస్థితి వచ్చింది. అలా మొదటి అడుగు వేసిందీ, కొంచెం ఇబ్బందికర వాతావరణం తీసుకువచ్చింది తెలంగాణ రాష్ట్రమే. తర్వాత వారే మాటల దాడినీ మొదలుపెట్టారు’ అని అన్నారు.

అవసరమైతే కేంద్రంపై ఒత్తిడి తెస్తాం..

తెలంగాణ మంత్రులు, నేతలు ఘాటుగా మాట్లాడుతున్నారని విలేకరులు ప్రశ్నించగా సజ్జల స్పందించారు. ‘మన పొరుగు రాష్ట్రం, దాన్ని వేరే రకంగా చూడాల్సిన పనిలేదు. కేంద్రం క్రియాశీలకంగా స్పందిస్తుంది. కాబట్టి మనవైపు నుంచి నెగెటివ్‌గా వ్యాఖ్యానించనక్కర్లేదు. ముఖ్యమంత్రి కూడా అవే ఆదేశాలిచ్చారు. అధికారులు వారి పని వారు చేస్తున్నారు, అక్కడ కానప్పుడు రాజకీయంగా మంత్రులు మాట్లాడతారు. కాని పక్షంలో న్యాయం చేయాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెస్తాం’ అని తెలిపారు.

సంయమనంతో మాట్లాడకపోతే నష్టం..

రాష్ట్ర ప్రభుత్వం సరిగా వ్యవహరించడం లేదని తెదేపా నేతలంటున్నారని విలేకరులు ప్రస్తావించగా సజ్జల సమాధానమిస్తూ.. ‘మొన్నటి వరకూ మీరూ (చంద్రబాబును ఉద్దేశించి) ముఖ్యమంత్రిగా చేశారు. అప్పుడు శ్రీశైలం కింద భాగంలో తెలంగాణవారు ప్రాజెక్టులు కడితే ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడూ తెలంగాణ చర్యలపై ప్రశ్నించలేకపోతున్నారెందుకు? ఇక్కడ అందరూ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడాలి. అదే సమయంలో సంయమనంతో మాట్లాడాలి. ఏదో రెచ్చగొట్టి.. దాంట్లో నుంచి ఏవో ప్రయోజనాలు పొందాలనుకుంటే ఆఖరికి నష్టపోయేది రాష్ట్రమేనని గుర్తించాలి’ అని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ప్రభుత్వమే దుర్మార్గంగా వెళుతోంది..

ఏపీకి కేటాయించిన నీటి వాటాకు లోబడే ఇక్కడ ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌(ANIL KUMAR YADAV) స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వమే దుర్మార్గంగా ముందుకెళ్తోందని విమర్శించారు. సాగు, తాగునీటికే ప్రథమ ప్రాధాన్యమని.. తర్వాతే విద్యుదుత్పత్తికి వెళ్లాలన్నారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాజెక్టులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘తెలంగాణ ప్రభుత్వం పులిచింతలలో విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని కిందకి వదులుతోంది. ఈ వివాదాల నుంచి గట్టెక్కడానికే అన్ని ప్రాజెక్టులనూ కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకురమ్మని అడుగుతున్నాం. తెలంగాణ వారికి చిత్తశుద్ధి ఉంటే దీనిపై మాట్లాడాలి. 2009లో తెలంగాణలోనే రాజశేఖర్‌రెడ్డికి ఎక్కువ సీట్లు వచ్చాయి. దాన్నిబట్టి ఆక్కడి ప్రజలు ఆయన్ను ఎంతలా ఆదరిస్తున్నారో తెలుస్తోంది. దాన్ని పక్కనపెట్టి తెలంగాణ మంత్రులు రాజశేఖర్‌ రెడ్డిని, జగన్‌మోహన్‌ రెడ్డిని(CM JAGAN) ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదు. తెలంగాణ దుర్మార్గ పోకడలపై ఇప్పటికే ప్రధాని, కేంద్ర మంత్రి, కృష్ణా బోర్డుకు లేఖలు రాశాం. ప్రస్తుతం నెలకొన్నవి చాలా సున్నితమైన అంశాలు. వాళ్లు దుర్మార్గంగా ముందుకెళ్తుంటే ఆంధ్రా సంయమనంతో వ్యవహరిస్తుంది. ఈ కష్ట సమయంలో అంతా ఏకతాటిపైకి రావాల్సింది పోయి ప్రతిపక్ష నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మేం ముందు చెప్పిన దానికే కట్టుబడి ఉన్నాం. తెదేపా తన అభిప్రాయాన్ని ఇప్పటికైనా చెప్పాలి’ అని మంత్రి అన్నారు. శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేసే నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా రైతులు కూడా సానుకూలంగా ఉన్నారని చెప్పారు. కొవిడ్‌ ఆంక్షల కారణంగా ఒడిశా ముఖ్యమంత్రిని కలవలేకపోయామన్నారు. అన్నీ సానుకూలంగా జరిగితే త్వరలోనే దీని నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్‌ శంకుస్థాపన చేస్తారని అనిల్‌ ప్రకటించారు.

ఇదీ చదవండి:

KRISHNA BOARD: రంగంలోకి కృష్ణా బోర్డు

ABOUT THE AUTHOR

...view details