ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Kaushik Reddy: రూ.50 కోట్లు ఇచ్చి రేవంత్ పీసీసీ చీఫ్​ అయ్యాడు: కౌశిక్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌, టీపీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.రూ.50 కోట్లు ఇచ్చి రేవంత్.. పీసీసీ చీఫ్​ అయ్యారని దుయ్యబట్టారు.

Kaushik Reddy resign to Congress
కాంగ్రెస్‌ పార్టీకి కౌశిక్‌రెడ్డి రాజీనామా

By

Published : Jul 12, 2021, 5:32 PM IST

Updated : Jul 12, 2021, 7:39 PM IST

పాడి కౌశిక్‌రెడ్డి

తెలంగాణలోని హుజూరాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌, టీపీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వంతో పాటు పీసీసీ కార్యదర్శి పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు సోనియాగాంధీకి తన రాజీనామా పత్రాన్ని పంపారు. ఇన్నాళ్లు ప్రోత్సహించిన రాహల్​ గాంధీ, ఉత్తమ్​కుమార్​ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాజా రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని రాజీనామా నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. తన రాజీనామాకు ఉత్తమ్​కుమార్​ రెడ్డికి సంబంధం లేదన్న కౌశిక్​.. ఇది తన సొంత నిర్ణయమన్నారు. చాలా బాధతో ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో హుజూరాబాద్‌ టికెట్‌ తనకే వస్తుందని ఓ కార్యకర్తతో ఫోన్‌లో జరిపిన సంభాషణ సంచలనం సృష్టించింది.

రేవంత్​కు కౌశిక్​ సవాల్​

రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావాలని కోరుకున్నవారిలో తాను మొదటివాడినన్న కౌశిక్‌.. రూ.50 కోట్లు ఇచ్చి రేవంత్ పీసీసీ చీఫ్​ అయ్యారని ఆరోపించారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ గెలవదన్న రేవంత్‌ వ్యాఖ్యలు బాధాకరమన్నారు. సీనియర్లను కాదని తెదేపా నుంచి వచ్చిన రేవంత్‌కు పీసీసీ ఇవ్వడం దారుణమన్నారు. అమ్ముడుపోయింది తాను కాదని.. రేవంత్​ రెడ్డి ఈటల రాజేందర్​కు అమ్ముడుపోయారని ఆరోపించారు. హుజూరాబాద్​లో కాంగ్రెస్​ పార్టీ డిపాజిట్ అయినా​ తెచ్చుకోవాలని రేవంత్‌రెడ్డికి కౌశిక్​రెడ్డి సవాల్‌ విసిరారు. ఆరు నెలల్లో కాంగ్రెస్​ పార్టీ ఖాళీ అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఎమ్మెల్యేగా ఓడిన రేవంత్‌రెడ్డి సీఎం అవుతారా అంటూ ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్​ నుంచి బహిష్కరణ

కౌశిక్​ రెడ్డి వ్యాఖ్యలపై పీసీసీ క్రమశిక్షణ సంఘం వెంటనే స్పందించింది. కాంగ్రెస్‌ నుంచి హుజూరాబాద్‌ నేత కౌశిక్‌రెడ్డిని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.

హాట్​ టాపిక్​గా మారిన రాజీనామా

మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో హుజురాబాద్‌ టికెట్‌ తనకే వస్తుందని ఓ కార్యకర్తతో ఫోన్‌లో జరిపిన సంభాషణ సంచలనం సృష్టించింది. మాదన్నపేటకు చెందిన విజయేందర్‌ అనే కార్యకర్తతో కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. హుజూరాబాద్‌ తెరాస టికెట్‌ తనకే ఖాయమైనట్లు చెప్పారు. యువతకు ఎంత డబ్బు కావాలో తాను చూసుకుంటానని.. ప్రస్తుతం వారి ఖర్చులకు ఒక్కొక్కరికీ రూ.4-5వేలు ఇస్తానని అతడికి తెలిపారు. ఈ విషయంపై కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు రాజిరెడ్డిని కలవాలని విజయేందర్‌కు కౌశిక్‌రెడ్డి సూచించారు. ఇటీవల ఓ ప్రైవేటు కార్యక్రమంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ను కౌశిక్‌రెడ్డి కలిశారు. ఈ నేపథ్యంలో ఆయన జరిపిన ఫోన్‌ సంభాషణ బయటకు రావడంపై ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో పార్టీ ఆయనకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. 24గంటల్లో వివరణ ఇవ్వాలని తెలిపింది. కాగా, కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తూ కౌశిక్‌ నిర్ణయం తీసుకోవడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌ అయింది.

ఇదీ చదవండి:

Kaushik Reddy Audio Viral: హుజూరాబాద్ తెరాస టికెట్ నాదే..!

Last Updated : Jul 12, 2021, 7:39 PM IST

ABOUT THE AUTHOR

...view details