కార్తికం(karthika masam 2021)లో ప్రతి నిత్యమూ పవిత్రమైనదే! విశేషించి కార్తిక సోమవారాలకు ప్రత్యేకత ఉంటుంది. కార్తిక సోమవారం నాడు పాటించే- స్నానం, దానం, దీపారాధనం, అర్చనం, దైవదర్శనం అనే పంచకృత్యాల్ని కార్తిక సోమవార(karthika masam 2021) వ్రతంగా అనుసరిస్తారు. వసిష్ఠమహర్షి ద్వారా జనకమహారాజు కార్తిక సోమవార వ్రత వైభవాన్ని తెలుసుకుని, మహాదేవుడి కృపకు పాత్రుడయ్యాడని పురాణాలు విశ్లేషించాయి. ఉపవాస దీక్షతో శుద్ధోదకం, గోక్షీరం, పంచామృతాలతో రుద్రాభిషేకాన్ని, బిల్వదళాలతో రుద్రార్చన కార్తిక సోమవారంనాడు నిర్వహించాలని రుద్రాక్షోపనిషత్తు వివరించింది. ఉపవాస దీక్షను పాటించలేనివారు సమంత్రక స్నానజపాదులు చేసినా శివకరుణ సాధించవచ్చంటారు. శంకరుణ్ని చంద్రమౌళిగా, చంద్రశేఖరుడిగా, సోమేశ్వరుడిగా ఆరాధిస్తారు. మనసు, బుద్ధి, చిత్తం వంటి ఆత్మానుగతమైన అంశాలపై చంద్ర ప్రభావం ఉంటుందంటారు. అలాంటి చంద్రుడు ఈశ్వరుడి అధీనమై, సిగపువ్వై వర్ధిల్లుతున్నాడు. నిరంతరం నిలకడ లేకుండా సంచరించే మనసును, శివభక్తి అనే తాడుతో బంధిస్తే, ఆ మనసు కుదురుగా ఉంటుంది. మనోవికారాల్ని రూపుమాపుకోవడానికి శివభక్తే అసలైన ఔషధమని శివానందలహరిలో జగద్గురువు ఆదిశంకరులు స్పష్టం చేశారు.
హరహర మహాదేవ.. కార్తీక సోమవారం శివపూజ ఇలా చేయాలి.. - karthika masam special story
సమస్త సృష్టికి ఆధారమై, సర్వశక్తులకు నిలయమై తేజరిల్లే మహా చైతన్య రూపమే పరమేశ్వరుడు. అఖిల జగత్తూ శివ స్వరూపమని శివలింగాకృతి వెల్లడిస్తుంది. ఆత్మదీపాన్ని వెలిగించుకుని, ఆ దివ్యకాంతిలో సాధకులు ఈశ్వరుణ్ని దర్శించాలి. జడత్వం నుంచి జాగృతి దిశగా పయనించడానికి కార్తికంలో అవలంబించే విధివిధానాలు ఎంతగానో ఉపకరిస్తాయని కార్తిక పురాణం(karthika masam 2021) చెబుతోంది.
సోమవారంతో కూడిన కార్తిక శుద్ధ చవితి(karthika masam 2021) ఎంతో ప్రశస్తమైనదిగా స్కాందపురాణం పేర్కొంది. నాగులచవితిగా నిర్వహించుకునే ఈ పావన సందర్భం శివసుబ్రహ్మణ్య శక్తుల ఏకీకృత అనుగ్రహానికి కారకమవుతుందంటారు. శ్రీనాథుడి శివరాత్రి మాహాత్మ్యంలో, చతుర్వర్గ చింతామణిలో నాగులచవితి ఆచరణ విధుల్ని నాగవ్రతంగా ప్రస్తావించారు. బ్రహ్మపురాణం ఈ వ్రతాన్ని కౌటుంబిక క్షేమ ప్రక్రియగా చెబితే, అగ్నిపురాణం శాంతివ్రతంగా ప్రస్తావించింది. మహావిష్ణువుకు శయ్యగా, నీలకంఠుడికి కంఠాభరణంగా, వెలిగే సర్పాన్ని సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వరూపంగా ఆర్షధర్మం దర్శిస్తోంది.
నాగారాధన ఎన్నో అంతరార్థాల సమాహారం. యోగశాస్త్రరీత్యా, మన వెన్నెముకనే వెన్నుపాముగా వ్యవహరిస్తారు. దీనికి దిగువన కుండలిని శక్తి ఉంటుందంటారు. యోగసాధనతో కుండలిని శక్తిని సహస్రారానికి వెన్నుపాము ద్వారా ప్రయాణించడానికి సాధకులు నిరంతరం ప్రయత్నించాలని చెబుతారు. మన శరీరంలో అరిషడ్వర్గాలనే విషపూరితమైన భావాలు ఒకదానితో ఒకటి పోటీపడుతుంటాయి. శిరస్సు పైభాగాన ఉండే బ్రహ్మ రంధ్రం ద్వారా జ్ఞానక్షీరాన్ని స్వీకరించాలి. అందువల్ల, మన శరీరం అమృతమయమై, తేజస్సుతో ప్రకాశిస్తుంది. పుట్టలో నాగుల చవితినాడు పాలు పోయడంలో ఆంతర్యం ఇదే! జీవన ప్రస్థానానికి ‘నాగం’ అనే పేరూ ఉంది. సర్పం వలే ప్రతి వ్యక్తీ గమనశీలత్వాన్ని చలనశీలత్వాన్ని సంతరించుకుని, జీవిత పథాన పురోగమించాలి! మన శరీరం నవరంధ్రాలున్న మట్టి పుట్ట. ఈ పుట్టలో అనేక కాలనాగులు పొంచి ఉంటాయి. అవి విజృంభించకుండా ఉండటానికి ఆధ్యాత్మిక చింతన అనే మధు ధారల్ని ఎల్లవేళలా మనలోకి మనం నిక్షిప్తం చేసుకోవాలి. అంతర్వీక్షణతో, మనల్ని మనం ఉద్ధరించుకుంటూ దీపశిఖలా, నాగమణిలా విరజిమ్మాలని నాగులచవితి నేపథ్యంగా సనాతన సంప్రదాయం సందేశమిస్తోంది!
- ఇదీ చదవండి :పర్వదినాల మాసం... మహిమాన్విత కార్తికం