తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది కార్తికమాసంలో పెళ్లిళ్లకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. దీనికితోడు జనవరి 13 నుంచి ఫిబ్రవరి 11 దాకా పుష్యమాసంలో గురుమూఢం ఉంది. ఫిబ్రవరి 12 నుంచి మాఘమాసం మొదలైనా.. మూఢం కొనసాగుతున్నందున పెళ్లిళ్లకు ఆస్కారం లేదు. ఏప్రిల్ 13న చైత్రమాసం ఉగాదితో ప్లవ నామ సంవత్సరం మొదలైనా పెళ్లి ముహూర్తాలు లేవు. ఈ లెక్కన వచ్చే నెలరోజుల్లో చేయలేకపోతే తర్వాత దాదాపు మరో 6 నెలలు.. అంటే మే 12న వైశాఖం మొదలయ్యేదాకా మంచి ముహూర్తాలుండవని కొందరు ఇప్పుడే శుభకార్యాలు పెట్టుకుంటున్నారు.
పెరిగిన సంప్రదింపులు..
మార్చి నుంచి సెప్టెంబరు దాకా పెళ్లి సంబంధాల కోసం సంప్రదించినవారు పెద్దగా లేరని, గత నెల నుంచి మళ్లీ పెరిగారని హైదరాబాద్‌కు చెందిన ఓ మ్యారేజీ బ్యూరో ప్రతినిధి తెలిపారు. కొంతమంది ఈ కార్తికంలో పెళ్లిళ్లకు సిద్ధపడుతుండగా మరికొందరు ఈ నెలలో నిశ్చితార్థం నిర్వహించుకుని మేలో ముహుర్తాలు పెట్టుకోవాలని భావిస్తున్నారు. అప్పటికి కరోనా భయం పూర్తిగా తగ్గవచ్చన్నది వారి అంచనా.
కల్యాణమండపాలకు గిరాకి
గత మార్చి నుంచి కల్యాణమండపాలు, ఫంక్షన్‌హాళ్ల వంటి వాటికి గిరాకి లేదు. దాదాపుగా అవన్నీ ఖాళీగానే ఉన్నాయి. ప్రభుత్వం కూడా వందమందిలోపే పెళ్లికి పిలవాలనే ఆంక్షలు పెట్టినందున అప్పటికే పెళ్లి ముహూర్తాలు నిర్ణయించుకున్నవారు ఇళ్ల వద్ద లేదా ఇతర చిన్న ఫంక్షన్‌హాళ్లతో సరిపెట్టుకున్నారు. శుభకార్యాలకు విందు భోజనాలు తయారుచేసే హోటళ్లు, మెస్‌లకు సైతం ఇప్పుడిప్పుడే బుకింగులు వస్తున్నాయి. అయితే కరోనాకు ముందు ఉన్నంత డిమాండు ఇప్పుడు లేదని, ఈనెలలో పెరగవచ్చని భావిస్తున్నామని మెస్ యజమానులు ఆశాభావం వ్యక్తం చేశారు.