తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణాలు, వ్రత మండపాలు కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజామున 2 గంటల నుంచి వ్రతాలు, 4 గంటల నుంచే దర్శనాలు ప్రారంభించారు. ముమ్మడివరం మురమల్ల వీరేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.. యానం వద్ద గోదావరిలో నీరు తక్కువగా ఉండడంతో జల్లు స్నానాలు ఆచరించిన భక్తులు గోదావరిలో దీపాలను వదిలారు. పి.గన్నవరం లోని గరుడ స్వామి, కారేపల్లి అగ్రహారంలోని పార్వతి సోమేశ్వర స్వామి, బెల్లంపూడి లోని లక్ష్మీశ్వర స్వామి, పుల్లేటికుర్రు వ్యాఘ్రేశ్వర స్వామి, ముక్తేశ్వరం ముక్తికాంతా క్షణ ముక్తేశ్వర స్వామి ఆలయాలు భక్తజన సంద్రంగా మారాయి.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం లోని గోకర్ణేశ్వర స్వామి, రామలింగేశ్వర స్వామి, పంచారామ క్షేత్రం క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయాల్లో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. తణుకు పాతవూరు సిద్ధేశ్వరాలయం, కపర్ధీశ్వరాలయం భక్తులతో రద్దీగా మారింది.
గుంటూరు జిల్లా సూర్యలంక తీరంలో కార్తీక సాగర హారతి నిర్వహించారు. ఉపసభాపతి కోన రఘుపతి హారతి ఇచ్చారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ వేద పండితులచే కార్తీక సాగర హారతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పల్నాడు దైద అమరలింగేశ్వర స్వామి దేవాలయం, పిడుగురాళ్ల పట్టణంలో శ్రీ రామలింగేశ్వర దేవాలయం, మాచవరం శ్రీ బొగ్గ మల్లయ్య దేవస్థానాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.