ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆలమట్టి నిండకముందే నీటిని విడుదల చేసిన కర్ణాటక

ఆలమట్టికి భారీ వరద వస్తే బ్యాక్‌వాటర్‌తో ముంపు తలెత్తకుండా కర్ణాటక ప్రభుత్వం ముందుజాగ్రత్తలు తీసుకుంది. నీటి నిల్వ 100 టీఎంసీలకు చేరకుండానే దిగువకు విడుదల చేసింది. ఆలమట్టిలో 96.5 టీఎంసీలు నిల్వ ఉండగా, 47వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తే అంతే నీటిని నీటిని దిగువకు వదిలారు. డ్యాం నిండకముందే ఆలమట్టి నుంచి దిగువకు నీటి విడుదల గతంలో ఎప్పుడూ జరగలేదు.

Almatti  project
Almatti project

By

Published : Jul 15, 2020, 7:12 AM IST

ఆలమట్టి నిండకముందే నీటిని విడుదల చేసిన కర్ణాటక

ఆలమట్టి జలాశయంలో నీటి నిల్వ వంద టీఎంసీలకు చేరకుండానే కర్ణాటక దిగువకు నీటిని విడుదల చేసింది. జులై రెండో వారంలో.. అదీ డ్యాం నిండకముందే ఆలమట్టి నుంచి దిగువకు నీటిని గతంలో ఎప్పుడూ విడుదల చేయలేదు. ప్రాజెక్టుకు భారీగా వరద వస్తే బ్యాక్‌వాటర్‌తో పలు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా విడుదల చేశారని నీటిపారుదల శాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఆలమట్టిలో పూర్తి స్థాయిలో నీటి నిల్వ చేయడం వల్ల జలాశయానికి భారీ వరద వచ్చినపుడు దిగువకు పూర్తిస్థాయిలో నీటిని వదిలినా బ్యాక్‌వాటర్‌ ప్రభావం ఎక్కువగా ఉండి మహారాష్ట్రలోని పలు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి.

నిపుణుల కమిటీ

ఈ సమస్య ఆలమట్టిలోనే కాదు అనేక ప్రాజెక్టుల్లో ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర జలసంఘం, డ్యాం సేఫ్టీ విభాగం, కర్ణాటక నీటిపారుదల శాఖ అధికారులు దీనిపై అధ్యయనం చేయడంతోపాటు ప్రత్యేకంగా ఓ నిపుణుల కమిటీని నియమించారు. అది ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకొని ఆలమట్టి ప్రాజెక్టు కోసమే ప్రత్యేకంగా నిర్వహణ నిబంధనావళి(మాన్యువల్‌)ని రూపొందించారు. ఏడాది క్రితం దీనిని అధికారికంగా కర్ణాటక నీటిపారుదల శాఖ ప్రకటించింది. ఆ ప్రకారం జులై రెండో పక్షంలో ఆలమట్టిలో 513.6 మీటర్ల వరకే నీటిని నిల్వ చేయాలి. ఆగస్టు మొదటి పక్షంలో 518.66 మీటర్లు, ఆగస్టు రెండో పక్షంలో పూర్తి స్థాయి నీటిమట్టం 519.6 మీటర్ల వరకు నిల్వ చేసుకోవచ్చు.

47 వేల క్యూసెక్కుల ప్రవాహం..విడుదల

డ్యాంల నిల్వ, నిర్వహణకు కేంద్ర జలసంఘం, ఎన్‌.ఎం.డి.ఎ. పర్యవేక్షిస్తున్నందున మాన్యువల్‌ ప్రకారం నీటిని దిగువకు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆలమట్టిలో 96.5 టీఎంసీలు నిల్వ ఉండగా, 47వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తే అంతే నీటిని నీటిని దిగువకు వదిలారు. ఈ కారణంగానే భీమా ప్రవాహం ప్రధాన కృష్ణాలో కలిసిన తర్వాత హువెనగుడి వద్ద ఉండే కేంద్రజలసంఘం గేజ్‌ పాయింట్‌ వద్ద మంగళవారం 40వేల క్యూసెక్కుల ప్రవాహం నమోదైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

జలాశయంలో ప్రస్తుత అనుమతి స్థాయి

ఆలమట్టిలో ప్రస్తుతం పూర్తి స్థాయి నీటిమట్టం 519.6 మీటర్లు. ఈ మట్టం వరకు నీటి నిల్వ 129 టీఎంసీలు. బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పు అమలులోకి వస్తే ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 524.256 మీటర్లు. ఈ మట్టం వరకు నిల్వ చేస్తే 229 టీఎంసీలు ఉంటాయి. అంటే మరో 100 టీఎంసీలు అదనంగా నిల్వ చేయడానికి వీలవుతుంది. అప్పుడు జులై రెండో పక్షంలో 516.81 మీటర్ల వరకు, ఆగస్టు మొదటి పక్షంలో 522.87 మీటర్లు, ఆగస్టు రెండో పక్షంలో పూర్తి స్థాయిలో నిల్వ చేయవచ్చు. ట్రైబ్యునల్‌ తీర్పు నోటిఫై అయితే తెలుగు రాష్ట్రాలకు గడ్డు పరిస్థితులు మొదలవుతాయి.

ప్రాజెక్టు కింద 11.52 లక్షల హెక్టార్లు సాగు

ఆలమట్టికి ప్రస్తుతం 173 టీఎంసీల కేటాయింపు ఉండగా, 6.22 లక్షల హెక్టార్ల ఆయకట్టు ఉంది. బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ అదనంగా 130 టీఎంసీలు కేటాయించింది. ఈ నీటితో మరో 5.3 లక్షల హెక్టార్ల ఆయకట్టు సాగులోకి తేవాలన్నది లక్ష్యం. మొత్తమ్మీద ఈ ప్రాజెక్టు కింద 11.52 లక్షల హెక్టార్ల ఆయకట్టు సాగులోకి వస్తుంది.

ఇదీ చదవండి :

రిలయన్స్ ఏజీఎంలో ఈ సారి కీలక ప్రకటనలు ఇవే!

ABOUT THE AUTHOR

...view details