ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Bandi Sanjay : బండి సంజయ్​కి 14 రోజుల రిమాండ్​..! - jp nadda on bandi sanjay arrest

భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్​కి కరీంనగర్​ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. జయ్‌పై ఉన్న 10 పాత కేసులను రెండో ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. దీనిపై ఆయన తరఫు లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిన్నటి ఘటనలో 11 మంది పరారీలో ఉన్నట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు.

బండి సంజయ్​కు 14 రోజుల రిమాండ్
బండి సంజయ్​కు 14 రోజుల రిమాండ్

By

Published : Jan 3, 2022, 7:06 PM IST

Bandi Sanjay: భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్​కి కరీంనగర్​ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. సంజయ్‌ సహా కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్‌, పుప్పాల రఘు, కాచు రవి, మర్రి సతీశ్‌కు ఈనెల 17 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. జాగరణ దీక్ష సందర్భంగా జరిగిన ఉద్రిక్తత ఘటనలపై పోలీసులు రెండు ఎఫ్​ఐఆర్​లు నమోదు చేశారు. రెండో ఎఫ్‌ఐఆర్ ఆధారంగా సంజయ్‌కి కోర్టు రిమాండ్ విధించింది. సంజయ్‌పై ఉన్న 10 పాత కేసులను రెండో ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. దీనిపై ఆయన తరఫు లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిన్నటి ఘటనలో 11 మంది పరారీలో ఉన్నట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు.

సంజయ్‌కు అందించే ఆహారాన్ని.. జైలర్ రుచి చూశాకే ఇవ్వాలని ఆయన తరఫు లాయర్లు కోర్టును కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఆ విధంగానే ఆహారం ఇవ్వాలని స్పష్టం చేసింది. అనంతరం కోర్టు ఆదేశాలతో సంజయ్​ని జైలుకు తరలించారు. బెయిల్ కోసం జిల్లా కోర్టును బండి సంజయ్ ఆశ్రయించనున్నారు.

ఏం జరిగిందంటే..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీల కోసం విడుదల చేసిన.. జీవో 317ను సవరించాలని డిమాండ్‌ చేస్తూ బండి సంజయ్​ చేపట్టిన జాగరణ దీక్షను.. పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఆదివారం రాత్రి కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయం వద్ద భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తలపెట్టిన దీక్షకు అనుమతిలేదని పోలీసులు అడ్డుకున్నారు.

వారిని తప్పించుకొని.. కార్యాలయంలోకి వెళ్లి సంజయ్‌ దీక్ష చేపట్టగా పోలీసులు తలుపులు పగులగొట్టి.. ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, భాజపా కార్యకర్తల మధ్య.. తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. భాజపా కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. అనంతరం సంజయ్​ను అరెస్ట్​ చేసిన పోలీసులు.. ఇవాళ ఉదయం కరీంనగర్​లోని కమిషనరేట్​ ట్రైనింగ్​ సెంటర్​కు తరలించారు. అనంతరం కోర్టుకు తరలించారు.

ఎంతవరకైనా పోరాడతా.. : సంజయ్​
ఈ సందర్భంగా.. ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం.. ఎంతవరకైనా పోరాడేందుకు సిద్ధమని.. ఎంపీ బండి సంజయ్ ప్రకటించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీవితాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి పోయే రోజులు దగ్గర పడ్డాయన్నారు. శాంతియుతంగా చేస్తున్న జాగరణ దీక్షను.. అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణ భాజపా నేతలు సైతం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి సహా ఆ పార్టీ ముఖ్యనేతలు.. పోలీసుల తీరును ఖండించారు.

బండి సంజయ్​కు 14 రోజుల రిమాండ్

సంజయ్​.. మీ పోరాటం అమోఘం..: జేపీ నడ్డా
బండి సంజయ్​ అరెస్ట్​, ఫలితంగా తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులపై భాజపా జాతీయ అధ్యక్షుడు జీపీ నడ్డా స్పందించారు. రాష్ట్రంలో పార్టీ గెలుపును ఓర్వలేకనే కేసీఆర్‌ సర్కారు.. కార్యకర్తలపై దాడులకు పాల్పడుతోందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఎన్ని ఒత్తిళ్లకు గురిచేసినా ప్రజాసమస్యలపై పోరు ఆగదని స్పష్టం చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్​ అరెస్టును ఆయన ఖండించారు. ఈ మేరకు బండి సంజయ్‌తో జేపీ నడ్డా ఫోన్‌లో మాట్లాడారు. మొన్నటి వరకు రైతుల సమస్యలపై బండి సంజయ్​ పోరాటం చేశారన్న జేపీ నడ్డా.. జీవో 317 పై ఆయన పోరాటం అమోఘమని కొనియాడారు. కేసులు పెట్టారని భయపడొద్దని బండి సంజయ్‌కు చెప్పారు. పోరాటంలో ముందుకెళ్లాలని సూచించారు. కేసీఆర్‌ సర్కారును న్యాయపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. కేసీఆర్​ సర్కారు చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ట్విట్టర్​ ద్వారా వీడియో విడుదల చేశారు.

ఇవీచదవండి :

ABOUT THE AUTHOR

...view details