మీడియాతో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్. జగన్ ప్రణాళికని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. తమ అక్రమ ఆస్తులు కాపాడుకునేందుకే తెదేపా అమరావతిలో కృత్రిమ ఉద్యమం సృష్టించిందని ఆరోపించారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం సరికాదన్నారు. ప్రజలు ఎన్నికల్లో ఇచ్చిన తీర్పును ప్రతిపక్షం గౌరవించి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని సూచించారు. ప్రాంతీయ అసమానతలు తొలగించేందుకు వైకాపా ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికోసమే సంస్కరణల్ని అమలు చేయాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు.
తెదేపా నిర్ణయాల వల్లే ఈ పరిస్థితి
రైతుల భావోద్వేగాలతో ఆడుకోవడం సరికాదన్న కన్నబాబు... కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో తెదేపా రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. చంద్రబాబు అనాలోచిత రాజకీయ నిర్ణయాల కారణంగానే రాష్ట్రం దారుణంగా నష్టపోయిందని విమర్శించారు. మండలి రద్దు తీర్మానాన్ని పార్లమెంట్లో అడ్డుకుంటామని తెదేపా చెప్పడం అసంబద్ధమని విమర్శించారు. అమరావతి కృత్రిమ ఆందోళనలను దేశం దృష్టికి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించడం... ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శమన్నారు. రాష్ట్రంలో ఏం విపత్తుల వచ్చాయని చంద్రబాబు జోలె పట్టారని మంత్రి ప్రశ్నించారు. పాలనా వికేంద్రీకరణ లక్ష్యంగా మూడు రాజధానులు ఏర్పాటుచేస్తున్నామని కన్నబాబు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి :ఇకపై ఇంటి వద్దకే పింఛన్.. ఫిబ్రవరి 1 నుంచి పంపిణీ