రాజధాని బిల్లులు ఆమోదించొద్దు: గవర్నర్‌కు కన్నా లేఖ - ఏపీ సీఆర్డీఏ రద్దు బిల్లులు న్యూస్

17:44 July 18
రాజధాని బిల్లులు ఆమోదించవద్దని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని లేఖలో అభిప్రాయపడ్డారు.
రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనమండలి సెలక్ట్ కమిటీకి పంపిందని కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. ఆ రెండు అంశాలు కోర్టు పరిధిలో ఉన్నందున.. ధిక్కారం కిందకు వస్తుందన్నారు. అమరావతి అభివృద్ధి కోసం గత ప్రభుత్వం బాండ్ల రూపంలో 2 వేల కోట్ల రూపాయలు సమీకరించిందని... అలాగే రాజధాని నిర్మాణానికి కేంద్రం కూడా నిధులు ఇచ్చిందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు రాసిన లేఖలో కన్నా వివరించారు.
రాజధాని కోసం అక్కడి రైతులు 32 వేల ఎకరాల భూమి ఇచ్చారని... వారు చేస్తున్న శాంతియుత పోరాటాన్ని గుర్తించాలని కోరారు. రాజ్యాంగపరమైన అంశాలను పరిశీలించడంతోపాటు ప్రజల ఆకాంక్షలు పరిగణించి నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌కు కన్నా విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం పంపించే బిల్లులు ఆమోదించవద్దని భాజపా తరఫున కోరుతున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: గవర్నర్ వద్దకు ఆ 2 బిల్లులు.. తిరుగుతున్నాయి ఎన్నో మలుపులు