MP Kanakamedala on AP Debts: ఆంధ్రప్రదేశ్ గత రెండున్నరేళ్ల వైకాపా పాలనలో రుణాంధ్రప్రదేశ్‌గా మారిపోయిందని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ధ్వజమెత్తారు. 2019 మేలో సీఎంగా చంద్రబాబు దిగి పోయే నాటికి అప్పు రూ.2,02,543 కోట్లని ప్రస్తుత ప్రభుత్వం విచక్షణారహితంగా అప్పులు చేయడంతో 2021 డిసెంబర్ నాటికి అది రూ.6,72,214 కోట్లకు చేరిందని తెలిపారు. రాజ్యసభలో కేంద్ర బడ్జెట్‌పై శుక్రవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘ఎనిమిది ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం తొందరపాటుతో ఆమోదించిన విభజన చట్టం కారణంగా ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులు ఎదుర్కొంటూనే వస్తోంది. రాజకీయాలను పక్కనపెట్టి మా రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రత్యేక హోదా డిమాండ్‌ను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకోవాలి. రాజధాని అమరావతిని కాపాడి, దానికి మద్దతు ఇవ్వాల్సి ఉంది. వైకాపా ప్రభుత్వం దాన్ని పక్కనపెట్టి అనిశ్చితి నెలకొల్పింది. పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టుల పూర్తికి తగిన నిధులు కేటాయించాలి. ప్రాజెక్టులను పదేళ్లలో పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటికే 8 ఏళ్లు గడిచిపోయింది' అని ఎంపీ అన్నారు.
రాష్ట్రంలో అపసవ్య పాలన
'ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత ఉండాలని కేంద్ర ఆర్థికమంత్రి చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అన్ని వ్యవహారాలూ బడ్జెట్‌లో పొందుపరిచిన విధానాలకు విరుద్ధంగా సాగుతున్నాయి. 2019 మే నాటికి రాష్ట్ర అప్పు రూ.2,02,543 కోట్లు మాత్రమే. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చిన గ్యారెంటీలు రూ.1,53,134 కోట్లు. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సినవి రూ.79వేల కోట్లు. డిస్కంల బకాయిలు రూ.29వేల కోట్లు. ఇవన్నీ కలిపితే ప్రస్తుత అప్పు రూ.6,72,214 కోట్లకు చేరింది. 2018-19లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రూ.44,234 కోట్లు రాగా 2021-22నాటికి అది రెట్టింపై రూ.86,866కోట్లు వచ్చింది. కేంద్రం నుంచి ఈ స్థాయిలో నిధులు వస్తున్నా రాష్ట్రం విచక్షణారహితంగా అప్పులు చేస్తోంది. కాగ్ అంచనాల ప్రకారం 2019-20లో రెవెన్యూ లోటు అంచనాలకు మించి.1486 శాతం పెరిగినట్లు కాగ్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లోనే రెవెన్యూలోటు రూ.40,829 కోట్లకు చేరింది. రెవెన్యూలోటు రూ.5వేల కోట్లు ఉంటుందని అంచనా వేయగా అది 816% పెరిగినట్లు స్పష్టమవుతోంది.