ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల పవిత్రత, ప్రజల మనోభావాలు కాపాడడంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం రాజ్యసభ శూన్యగంటలో ఆయన మాట్లాడారు. ‘‘తితిదే ఆలయాన్ని హిందువులు కాని వారు సందర్శిస్తే వారి నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని ఆలయ నిబంధనలు చెబుతున్నాయి. దశాబ్దాలుగా ఇది కొనసాగుతోంది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీలు గతంలో డిక్లరేషన్ సమర్పించారు. హిందువులు కాని వారు ఆలయాన్ని సందర్శిస్తే డిక్లరేషన్ అవసరం లేదని ఇటీవల తితిదే ఛైర్మన్ ప్రకటించారు. పుణ్యక్షేత్రం పట్ల విశ్వాసం ఉన్నవారు ఎవరైనా డిక్లరేషన్ సమర్పించకుండా భగవంతుడిని దర్శించొచ్చని తెలిపారు. ఈ ప్రకటన హిందువులు, ప్రజల మనోభావాలను దెబ్బతీసింది. ఏపీలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. అంతర్వేది, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దాడులు జరిగాయి. రథాల దగ్ధం, విగ్రహాల దొంగతనం వంటివి జరుగుతున్నాయి. అన్నీ మతాలకు సమాన ప్రాముఖ్యం ఇవ్వాలి. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోతే కేంద్రం జోక్యం చేసుకుని హిందువుల మనోభావాలు పరిరక్షించాలి’’ అని రవీంద్రకుమార్ కోరారు. ఒడిశాకు చెందిన బిజద సభ్యులు నెకంటి భాస్కరరావు, సస్మిత్‌పాత్రా, అమర్‌పట్నాయక్ మద్దతు తెలిపారు.
సంప్రదాయాలపై శ్రద్ధ లేదా?:
‘అన్యమతస్థులు ఎవరైనా కొండమీదికి రావచ్చు. ఏమైనా చేసుకోవచ్చనేలా తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నిర్ణయం ఉంది. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే. ఏపీ రెవెన్యూ దేవాదాయ-1, జీవోనంబర్ 311 ప్రకారం హిందువులు కానివారు తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాలి. గతంలో డిక్లరేషన్ ఇచ్చిన సందర్భాల్లేవని సుబ్బారెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. దేవాలయ ఆవిర్భావం నుంచి వస్తున్న ఆచారాన్ని తీసేయడంలో ఉన్న ఆంతర్యమేంటో ప్రభుత్వం సమాధానం చెప్పాలి’- ప్రకటనలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావు
జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే
‘అన్యమతస్థుడైన జగన్ తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇచ్చి తీరాల్సిందే. గత బ్రహ్మోత్సవాల సమయంలో జగన్ సతీసమేతంగా ఉత్సవాలకు రాకపోవడానికి కారణం వెల్లడించాలి. ఆలయాల పవిత్రతకు భంగం కలుగుతుంటే విశాఖలోని పెందుర్తి శారదాపీఠం స్వామి మౌనం ఎందుకు వహిస్తున్నారు? - మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి
నామోషీగా భావించేవారికి దర్శనమెందుకు?