I-Telugudesam : తెలుగు వారి ఆత్మగౌరవం నినాదంతో స్వర్గీయ నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం 40 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పార్టీ తొలితరం నేత.. కంభంపాటి రామ్మోహన్ రావు.... తెలుగుదేశంలో తన 40 ఏళ్ల అనుభవాలపై నేను -తెలుగుదేశం పుస్తకాన్ని రచించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో.... పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ , తెదేపా అధినేత చంద్రబాబు ముఖ్య అతిథులుగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. బండారు దత్తాత్రేయ ఈ సందర్భంగా ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రజలే దేవుళ్లుగా భావించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని చెప్పారు. అధికారంలో ఉండాలని కాకుండా... ప్రజాహితం కోసమే తెలుగుదేశం పని చేసిందని చంద్రబాబు తెలిపారు.
ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధం చాలా గొప్పదని పుస్తక రచయిత కంభంపాటి రామ్మోహన్‌రావు వెల్లడించారు. ప్రారంభం నుంచి పార్టీలో ఉండి కార్యకర్తగా మెుదలుకుని అనేక పదవుల్లో పనిచేశానని గుర్తుచేసుకున్నారు. ప్రాంతీయ పార్టీ అయినా.... జాతీయ భావాలతో కొనసాగటం తెదేపాకే సాధ్యమన్నారు. నేటి తరానికి తెలుగుదేశం గురించి తెలియాలనే పుస్తకాన్ని రాసినట్లు చెప్పారు.