శ్రీకృష్ణదేవరాయల హయాంలో నిర్మించిన కంభం చెరువు, పోరుమామిళ్ల చెరువు, బ్రిటిషు పాలనలో నిర్మించిన కేసీ కాలువలకు ప్రపంచ చారిత్రక నీటి పారుదల కట్టడాల (వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్) గుర్తింపు లభించింది. 2020 సంవత్సరానికిగానూ ప్రపంచంలోని 14 సాగునీటి ప్రాజెక్టులకు స్థానం లభించగా, ఇందులో భారతదేశంలో నాలుగింటికి అవకాశం లభించింది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి మూడు ఉండగా.. మహారాష్ట్రలోని ధామాపూర్ చెరువు మరొకటి. ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రెయినేజీ సంస్థకు (ఐ.సి.ఐ.డి) చెందిన న్యాయనిర్ణేతల బృందం అంతర్జాతీయంగా వచ్చిన ఎంట్రీలను పరిశీలించి ఎంపిక చేసింది.
రాయల కాలం నాటి కంభం చెరువు
ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్‌లోని కంభం చెరువు చారిత్రక ప్రసిద్ధి చెందినది. గుండ్లకమ్మ నదిపై నిర్మించిన ఈ చెరువు ఆసియాలోనే రెండో అతి పెద్ద సాగునీటి చెరువు. 500 ఏళ్లక్రితం నిర్మించిన ఈ చెరువు కింద 10,300 ఎకరాల ఆయకట్టు ఉంది. విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయల సతీమణి, ఒడిశాలోని గజపతుల కుమార్తె అయిన వరద రాజమ్మ (రుచిదేవి) ఈ దారిన వెళ్తూ చెరువు నిర్మాణం చేపట్టాలని సూచించారని, ఆమె సూచనకు అనుగుణంగా కంభం చెరువు నిర్మాణం జరిగిందని ఆంధ్రప్రదేశ్ జల వనరులశాఖ ప్రతిపాదనలో పేర్కొన్నారు. ఈ చెరువు 7 కి.మీ. పొడవు, 3.5 కి.మీ. వెడల్పు ఉంది.
500 ఏళ్లనాటి పోరుమామిళ్ల చెరువు
కడప జిల్లా పోరుమామిళ్లలోని ఈ చెరువుకూ 500 ఏళ్లకుపైగా చరిత్ర ఉంది. 1903లో బయటపడిన శాసనం ద్వారా ఈ చెరువు చరిత్ర వెలుగు చూసిందని నీటి పారుదలశాఖ వర్గాలు తెలిపాయి. విజయనగర రాజు మొదటి బుక్కరాయులు కుమారుడు భాస్కరుడు (భవదూరుడు) ఉదయగిరి రాజ్యానికి అధిపతిగా ఉన్నప్పుడు వేసిన పోరుమామిళ్ల శాసనం బట్టి ఆ సమయంలోనే ఈ చెరువు నిర్మాణం జరిగిందని అంచనాకు వచ్చారు. ఈ చెరువు కింద 3,864 ఎకరాల ఆయకట్టు ఉంది.