కాళేశ్వరం నుంచి ఎత్తిపోతలు ఆదివారం పునఃప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో యాసంగి అవసరాలకు గోదావరి జలాల తరలింపు మొదలైంది. ప్రాజెక్టు లింక్-1లోని కన్నెపల్లి(లక్ష్మీ), సిరిపురం, గోలివాడ పంపుహౌస్‌లలో రెండు మోటార్ల చొప్పున, లింక్-2లోని ఆరో ప్యాకేజీ నందిమేడారంలోని నంది పంపుహౌస్.. అలాగే ఎనిమిదో ప్యాకేజీలోని గాయత్రి పంపుహౌస్‌లో ఒక్కో మోటారు వంతున నడిపిస్తూ మధ్యమానేరు జలాశయానికి నీటిని తరలిస్తున్నారు.
తొలిరోజు నిరాటంకంగా...
లింక్-1లోని మూడు పంపుహౌస్‌లలో 5,200 క్యూసెక్కుల చొప్పున నీటిని ఎల్లంపల్లికి ఎత్తిపోస్తుండగా, అక్కడి నుంచి 3,150 క్యూసెక్కుల చొప్పున నందిమేడారం చెరువులోకి, దాని నుంచి అంతే మొత్తంలో గాయత్రి పంపుహౌస్‌కు వదిలారు. గాయత్రి పంపుహౌస్‌లో ఒక మోటారుతో ఎస్సారెస్పీ వరద కాలువలోకి ఎత్తిపోస్తుండగా శ్రీరాజరాజేశ్వర(మధ్యమానేరు) జలాశయానికి చేరుతోంది. దీని నుంచి 3,000 క్యూసెక్కుల నీటిని దిగువ మానేరు జలాశయానికి వదిలారు. ఎత్తిపోతల కార్యక్రమం తొలిరోజు నిరాటంకంగా సాగింది.