సౌర, పవన విద్యుత్ పీపీఏలపై తెదేపా ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను తప్పుబట్టిన వైకాపా సర్కార్, అంతకుమించిన రాయితీలతో కొత్త ఒప్పందం ఎలా చేసుకుందని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు నిలదీశారు. పీపీఏలు 25 ఏళ్ల ఒప్పందంపై నానా రాద్ధాంతం చేసిన వైకాపా... అంతకుమించిన రాయితీలతో 30 ఏళ్లకు కొత్త ఒప్పందానికి సిద్ధమయ్యారని ఆక్షేపించారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా ఉత్పత్తి నిలిపివేసినా పరిహారం చెల్లిస్తాననటం ఎవరి మెప్పు కోసమని కళా ప్రశ్నించారు. కంపెనీలు చెల్లించాల్సిన బకాయిలకు ప్రభుత్వమే గ్యారెంటీ ఇస్తుందని చెప్పడం దేనికోసమని నిలదీశారు.
ఏపీజీఈసీఎల్కు కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లను నేరుగా డెవలపర్లకు ఇస్తామని చెప్పడం ఎవరిని మెప్పించడం కోసమని మండిపడ్డారు. ప్లాంట్ పెట్టడానికి ఒక ఎకరానికి లీజు గత ప్రభుత్వం రూ.31,000 నిర్ణయిస్తే దానిని రూ.25,000 తగ్గించారన్నారు. ఇవన్నీ కొత్త పెట్టుబడుల ఆకర్షణలో భాగమే అంటున్న ప్రభుత్వం గతంలో తెదేపాపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలేనని ఒప్పుకుందన్నారు.