కరోనా వైరస్ వ్యాప్తిని నివారించే చర్యలు చేపట్టడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని... తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్ ఆరోపించారు. 5 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో మూడుచోట్ల మాత్రమే కరోనా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడంపై ఆయన విమర్శలు చేశారు. వాటిల్లోనూ ఒకటి మూసేయడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిపక్ష అభ్యర్థులపై వేధింపులకు దిగుతున్నారని కళా వెంకట్రావ్ ఆక్షేపించారు.
స్థానిక ఎన్నికల్లో గెలవలేమనే భయం అధికార పార్టీ నేతల్లో పెరిగిందని, కండబలం, డబ్బుబలంతో అరాచకాలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ నేతల బెదిరింపులతో తీవ్ర ఆందోళనకు గురైన గుంటూరు జిల్లా తెదేపా జడ్పీటీసీ అభ్యర్థి పార హైమారావు గుండెపోటుతో మృతి చెందారన్నారు. వైకాపా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు జడ్పీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు హైమారావును బెదిరించారని ఆరోపించారు. ఆ మనోవేదనతోనే హైమారావు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.