రాష్ట్రంలో భూకుంభకోణంపై న్యాయ విచారణ జరిపించాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు డిమాండ్ చేశారు. విచారణ కమిటీ ఏర్పాటు చేస్తే.. సాక్ష్యధారాలతో అక్రమాలను నిరూపిస్తామన్నారు. ఈమేరకు ముఖ్యమంత్రి జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. వైకాపా నేతలకు దోచి పెట్టేందుకు ఇళ్ల పట్టాల కార్యక్రమం చేపట్టారని ఆరోపించారు. ఈ అవకతవకలపై వైకాపా నాయకులే కోర్టుల్లో కేసులు వేస్తున్నారని అన్నారు.
సఖల భోగాలతో జిల్లాకో రాజప్రసాదం నిర్మించుకొంటున్న పాలకులు.. పేదలను మాత్రం శ్మశానాలు, ముంపు ప్రాంతాలలో ఇళ్లు కట్టుకోమంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి చోట వైకాపా నేతలు ఇళ్లు కట్టుకోగలరా అని కళా నిలదీశారు. పశువుల మేత భూముల్లో నివాసాలకు స్థలాలు ఎలా ఇస్తారని హైకోర్టు ఆక్షేపించినా తీరు మారలేదన్నారు.