వైకాపా నేరగాళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. ప్రజా ప్రతినిధులపై వివిధ కోర్టుల్లో ఉన్న కేసుల వివరాలు అందజేయాలని రాష్ట్రాల హైకోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించడంతో ముఖ్యమంత్రి జగన్, విజయసాయిరెడ్డి సహా వైకాపా నేతలకు భయం పట్టుకుందన్నారు. 50 మంది వైకాపా ఎమ్మెల్యేలపై సీరియస్ క్రిమినల్ కేసులు, 9మంది మంత్రులపై క్రిమినల్ కేసులు, 7మంది ఎంపీలపై మహిళలపై అత్యాచారాలు చేసిన కేసులున్నాయన్నారు.
జగన్, సాయిరెడ్డిలకు భయం పట్టుకుంది: కళా - కళా వెంకట్రావు వార్తలు
ప్రజా ప్రతినిధులపై వివిధ కోర్టుల్లో ఉన్న కేసుల వివరాలు అందజేయాలని హైకోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించడంతో ముఖ్యమంత్రి జగన్, విజయసాయిరెడ్డి సహా వైకాపా నేతలకు భయం పట్టుకుందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. వైకాపా నేరగాళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిందని ఆయన విమర్శించారు.
ముఖ్యమంత్రి జగన్‌పై ఉన్న కేసులు 8 ఏళ్లుగా పెండింగులో ఉన్నాయని... కుంటి సాకులు చెప్తూ విచారణకు హాజరవటం లేదన్నారు. తమపై ఉన్న కేసులు త్వరగా విచారణ చేయాలని సుప్రీం కోర్టుకు జగన్, విజయసాయిరెడ్డి లేఖ రాయగలరా అని ప్రశ్నించారు. లేఖ సంగతి తర్వాత ఆ విధంగా విజయసాయిరెడ్డి కనీసం ఒక్క ట్వీట్ అయినా చేయగలరా అని నిలదీశారు. జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కాకుండా ఎందుకు విచారణను ఆలస్యం చేస్తున్నారన్నారు. ప్రజా జీవితంలో ఉన్నవారు తమ సచ్చీలత నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. ఇంత తక్కువ సమయంలో ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారని, పది రూపాయల షేర్‌ను 350 రూపాయలకు ఎలా కొనుగోలు చేశారని సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు జగన్ 8 ఏళ్లుగా ఎందుకు సమాధానం చెప్పటం లేదని మండిపడ్డారు. రూపాయి పెట్టుబడి పెట్టకుండా వేల కోట్లు జగన్ ఎలా సంపాదించారో తన విజయ రహస్యాన్ని ప్రజలకు ఎందుకు చెప్పటం లేదన్నారు. 'నేను నా అక్రమ సంపాదన' అనే పుస్తకం వేసి ప్రజలకు తెలియజేయవచ్చు కదా అని జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్, విజయసాయిరెడ్డి, వైకాపా నేతలు తమపై ఉన్న కేసుల విచారణకు కోర్టులకు సహకరించి తమ నిజాయితీ నిరూపించుకోవాలని కళా సూచించారు.
ఇదీ చదవండి:పీఎంవో డిప్యూటీ కార్యదర్శిగా ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి