kadem Project latest news : స్వాతంత్య్ర తొలినాళ్లలో నిర్మితమైన కడెం ప్రాజెక్టుకు మరోసారి కష్టం వచ్చింది. 27 ఏళ్ల తర్వాత సామర్థ్యానికి మించి వరదపోటెత్తడంతో ప్రమాదపుటంచుకు చేరుకుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ముందే అప్పటి భౌగోళిక స్థితిగతులకు అనుగుణంగా కడెం జలాశయం 9గేట్లతో నిర్మితమైంది. 1959లో భారీగా వరదరావడంతో ఆనకట్టకు కాస్తంత ముప్పువాటిల్లడంతో అప్పటి ప్రభుత్వం 1959లో 18 గేట్లతో పునర్ నిర్మాణ పనులను చేపట్టి 1962వరకు పూర్తిచేసింది. కడెం నుంచి మంచిర్యాల వరకు దాదాపుగా 60వేల ఎకరాలకు సాగునీరందిస్తోంది. 1995లో మరోసారి భారీగా వరద రావటంతో... మళ్లీ ముప్పు నెలకొంది. వరద ఉద్ధృతి కారణంగా ప్రాజెక్టు ఇరువైపులా ఆనకట్ట కోతకు గురికావడంతో అప్పట్లో ప్రమాదం తప్పింది. కానీ, ఈ ఘటనతో ప్రాజెక్టు పరిసర, దిగువ ప్రాంతాల్లోని ప్రజల్లో తీవ్రభయాందోళనలు మొదలయ్యాయి. తాజాగా వచ్చిన భారీ వరదలతో కడెం కష్టాలు మళ్లీ తెరపైకొచ్చాయి.
kadem Project inflow : కడెం జలాశయానికి ఇవాళ కూడా భారీగా వరద కొనసాగుతోంది. సామర్థ్యానికి మించి ప్రవాహం వస్తుండడంతో కడెం ప్రాజెక్టు భద్రతపై నీలినీడలు కమ్ముకోగా.... ప్రస్తుతం కాస్త వరద తగ్గుతుండడంతో ప్రమాదం తప్పింది. ముంపు వాసులు మాత్రం భయం నీడనే కాలం వెళ్లదీస్తున్నారు. కడెం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులకుగాను.. ప్రస్తుత నీటిమట్టం 700 అడుగులకు చేరింది. జలాశయంలోకి 3 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా.... 17 గేట్ల ద్వారా 3 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.
kadem Project is over flooded : మంగళవారం రోజున సెకనుకు 2లక్షల క్యూబిక్ మీటర్ల ప్రవాహంతో విరామం లేకుండా 24 గంటల ప్రవహిస్తే.... 10 టీఎంసీల నీరు వచ్చిచేరుతోంది. కడెంలో సెకనుకు 2.85లక్షల క్యూసెక్కుల నీటిని తట్టుకునే సామర్థ్యం ఉండగా...5లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహంతో వరద ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఎగువన బోథ్ ప్రాంతం నుంచి భారీ వరదతో కడెం జలాశయం నీటిమట్టం 700 అడుగులకు చేరుకుంది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం రాత్రికి రాత్రే ప్రమాదపు సైరన్ మోగించింది. పక్కనే ఉన్న పాతకడెం గ్రామాన్ని ఖాళీ చేయించింది. దిగువన ఉన్న కన్నాపూర్, కొందుకూరు, పాండవాపూర్, అంబరీపేట, బెల్లాల్ గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలా ఆగమేఘాలపై చర్యలు చేపట్టింది.
ఇదే క్రమంలో ఉద్ధృతి మరింత పెరగటంతో.... నిన్న ప్రాజెక్టులోని 18గేట్లను ఎత్తేందుకు అధికారులు ప్రయత్నించారు. 17 గేట్లు తెరుచుకోగా.... సాంకేతిక లోపంతో మరో గేటు తెరుచుకోలేదు. వాస్తవంగా కడెం ప్రాజెక్టులోకి సెకనుకు 2.95లక్షల క్యూసెక్కుల వచ్చే నీటి సామార్థ్యాన్ని తట్టుకునే వెసలుబాటు ఉంది. కానీ మంగళవారం రాత్రి దాదాపుగా 5లక్షల క్యూసెక్కుల నీరురావడం, బయటకు వెళ్లే నీరు దాదాపుగా 3లక్షల క్యూసెక్కులకే పరిమితం కావడంతో ప్రమాదభరితంగా మారింది.