కడప ఉక్కు పరిశ్రమకు ఇనుప ఖనిజం సరఫరాపై జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్‌కు అవసరమైన ముడి ఇనుము ఖనిజం కోసం ఈ ఒప్పందం జరిగింది.తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం సమక్షంలో ఎన్‌ఎండీసీ డైరెక్టర్ అలోక్‌కుమార్ మెహతా, ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ సీఎండీ పి.మధుసూదన్ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఎన్ఎండీసీతో ఒప్పందం చరిత్రాత్మకమని సీఎం జగన్ అన్నారు.
ఈ నెల 23న కడప స్టీల్‌ప్లాంట్‌కు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఎన్ఎండీసీతో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. పదివేల కోట్ల రూపాయల పెట్టుబడితో రాష్ట్ర హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ ఏర్పాటుకు సిద్ధమైన ప్రభుత్వం... 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి నివేదిక అందించిన కేంద్రప్రభుత్వ రంగ సంస్థ మెకాన్.... వచ్చే 35 ఏళ్లకు 160 నుంచి 200 మిలియన్ టన్నుల ముడి ఇనుము ఖనిజం అవసరమవుతుందని అంచనా వేసింది.