ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Justice NV Ramana On Telugu: 'భాషా ఔన్నత్యానికి ప్రభుత్వాలు మద్దతు ఇవ్వట్లేదు' - రవీంద్రభారతిలో ఘంటశాల శతజయంతి వేడుకలు

Justice NV Ramana On Telugu: ఘంటసాల శత జయంతి సందర్భంగా "సంగమం ఫౌండేషన్" ఆధ్వర్యంలో.. హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ ఎన్వీ రమణ.. రవీంద్రభారతి ప్రాంగణంలోని ఘంటశాల విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో గాన కోకిల పి.సుశీలను ఘంటశాల శతజయంతి పురస్కారంతో సత్కరించారు.

Justice NV Ramana On Telugu
Justice NV Ramana On Telugu

By

Published : Dec 4, 2021, 10:01 PM IST

Justice NV Ramana On Telugu: తెలుగు భాషా సంస్కృతులు క్రమంగా పడిపోతున్నాయని.. ప్రభుత్వాలు భాషా ఔన్నత్యానికి మద్దతు ఇవ్వడం లేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఘంటసాల శత జయంతి సందర్భంగా సంగమం ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ ఎన్వీ రమణ.. రవీంద్రభారతి ప్రాంగణంలోని ఘంటసాల విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో గాన కోకిల పి.సుశీలను ఘంటశాల శతజయంతి పురస్కారంతో సత్కరించారు. ఈ సందర్భంగా వేదికపై 100 మంది చిన్నారులు ఆలపించిన ఘంటసాల పాటలు తనను బాల్యంలోకి తీసుకెళ్లాయన్నారు.

"ఘంటసాల పాటలు మన జీవితాలతో పెనవేసుకుపోయాయి. "తెలుగువీర లేవరా.." పాట వింటే ఎంతో భావోద్వేగం కలుగుతుంది. అలాంటి గొప్ప గాయకుడున్న తెలుగు సినిమా రంగంలో.. తెలుగు భాష రోజురోజుకూ దిగజారిపోతోంది. తొలినాళ్లలో సినిమా రంగం ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించేది. వ్యాపారాత్మకంగా కాకుండా సామాజిక స్పృహాతో తీసే చిత్రాలనే ప్రజలు చర్చించుకుంటారు. నటీనటులు తెలుగు ఉచ్చారణపై ప్రత్యేక శ్రద్ద చూపాలి." -జస్టిస్​ ఎన్వీ రమణ

అనంతరం ఇదే వేదికపై ఎన్టీఆర్​ను "మన దేశం" చిత్రంతో నటుడిగా పరిచయం చేసిన నటి, నిర్మాత కృష్ణవేణితోపాటు పలువురు సినీరంగ ప్రముఖులు, గాయనీగాయకులను జస్టిస్ ఎన్వీ రమణ సత్కరించారు. ఈ వేడుకల్లో సీనియర్ నటుడు మురళీమోహన్, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ఏపీ మాజీ ఉపసభాపతి మడ్డలి బుద్దప్రసాద్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆర్.నారాయణమూర్తి, మంజుభార్గవి పాల్గొన్నారు.

ఘంటసాల, సుశీల, ఎన్టీఆర్​లకు భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారాలను ప్రదానం చేయాలని నటుడు ఆర్.నారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు. గానకోకిల పి.సుశీల తన మనసులోని మాటను బయటపెట్టారు. ప్రధాని నరేంద్రమోదీని కలిసి తెలుగులో మాట్లాడాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. వేదికపై శ్రీప్రఖ్యా ఆర్ట్స్, శ్రీలక్ష్మణాచారి మోమోరియల్ సంగీత పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు ఆలపించిన ఘంటసాల గీతాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ముప్పై ఏళ్ల కెరియర్‌లో ప్రతి ఏడూ ఉత్తమ గాయకుడు ఘంటసాలే..
కృష్ణాజిల్లా గుడివాడ తాలూకాలోని చౌటపల్లె గ్రామంలో 1922 డిసెంబర్‌ 4వ తేదీన రత్తమ్మ, సూర్యనారాయణ దంపతుల ఆరుగురు సంతానంలో ఒకరిగా జన్మించారు ఘంటసాల వెంకటేశ్వరరావు. 9వ తరగతి వరకు చదివారు. నాటకాల్లో ఆసక్తిగా నటించేవారు. తండ్రి మృదంగం వాయిస్తూ పాడుతూ ఉంటే.. ఘంటసాల బాలభరతుడిలా నృత్యం చేసేవారు. తన 11వ ఏట తండ్రి చనిపోయాక.. ఘంటసాల కుటుంబం మేనమామ పంచన చేరింది. 14 ఏళ్ల వయసులో చేతి ఉంగరం అమ్మి విజయనగరం వెళ్లి సంగీత కళాశాలలో చేరారు. ప్రిన్సిపల్‌ ద్వారం వెంకటస్వామినాయుడు ఆదరణతో నాలుగేళ్ల కోర్సు రెండేళ్లలో పూర్తి చేశారు.

ఆయన ముప్పై ఏళ్ల కెరియర్‌లో ఇంచుమించు ప్రతి ఏడూ ఉత్తమ గాయకుడు ఘంటసాలే! తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసుడిగా మూలవిరాట్టు వేంకటేశ్వరస్వామి ఎదురుగా భక్తి గీతాలు ఆలపించిన ధన్యజీవి ఘంటసాల. వాగ్గేయకారుడు అన్నమాచార్యుడి తర్వాత ఈ భాగ్యం ఆయనకే దక్కింది.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details