justice nv ramana on smuggling: గంధపు చెక్కల తర్వాత ఎర్రచందనం అతి పెద్ద స్మగ్లింగ్ వనరుగా మారిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. శేషాచలం అడవుల్లో రెండు దశాబ్దాల నుంచి ఎర్రచందనం చెట్లు విరివిరిగా పెరిగాయని... ఇదే ఆ ప్రాంతానికి ముప్పుగా మారిందని జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై పాత్రికేయుడు ఉడుముల సుధాకర్‌రెడ్డి రచించిన బ్లడ్ సాండర్స్ పుస్తకాన్ని దిల్లీ నుంచి జస్టిస్ ఎన్వీ రమణ ఆన్లైన్లో ఆవిష్కరించారు.
పరిశోధనాత్మక కథనాలు రావట్లేదు..
red sanders smuggling: దాదాపు 60 లక్షల ఎర్రచందనం చెట్లు నరికివేశారని, 5 లక్షలకు పైగా హెక్టార్లకు స్మగ్లింగ్ పాకిందని... ఈ క్రమంలో 2 వేల మంది బలైపోయారని రచయిత పేర్కొనడాన్ని బట్టి ఆ ప్రాంతంలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం అవుతోందని జస్టిస్ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వాళ్లలో స్మగ్లర్లతో పాటు పోలీసులు కూడా ఉన్నారని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. ప్రస్తుతం పరిశోధనాత్మక కథనాలు మీడియాలో రావడం లేదని... గతంలో మాత్రం కుంభకోణాల గురించి ఎన్నో కథనాలు వచ్చేవి అని జస్టిస్ రమణ ప్రస్తావించారు.