NRI Hospital: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని వద్ద ఉన్న ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి(ఎన్‌ఆర్‌ఐ అకాడమీ ఆఫ్ సైన్సెస్) కార్యనిర్వహణ కమిటీ సభ్యుల విషయంలో రెండువర్గాల మధ్య ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించేందుకు ఆర్బిట్రేటర్‌గా విశ్రాంత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవీందర్‌గుప్త పేరును ధర్మాసనం ప్రతిపాదించింది. ఈ విషయంలో ఆయన సమ్మతి తెలుసుకున్న తర్వాత తగిన ఉత్తర్వులిస్తామని పేర్కొంది. జస్టిస్ దేవీందర్‌గుప్త ఆసక్తి చూపకపోతే మరో విశ్రాంత సీజే జస్టిస్ నిస్సార్ అహ్మద్ కక్రూ పేరును పరిశీలిస్తామని తెలిపింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి కార్యనిర్వహణ కమిటీ సభ్యుల వివాదాన్ని ఆర్బిట్రేటర్ వద్ద పరిష్కరించుకోవాలని సోమవారం జరిగిన విచారణలో ధర్మాసనం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నియామకానికి విశ్రాంత హైకోర్టు సీజేల పేర్లను తమ ముందు ఉంచాలని ఇరువైపు న్యాయవాదులను కోర్టు ఆదేశించింది. మంగళవారం జరిగిన విచారణలో న్యాయవాదులు.. విశ్రాంత హైకోర్టు సీజేల పేర్లను కోర్టు ముందు ఉంచారు. జస్టిస్ దేవీందర్‌గుప్త పేరును ఆర్బిట్రేటర్‌గా ధర్మాసనం ప్రతిపాదించింది.