Jr. NTR on NTR Name change issue: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్ రామ్ స్పందించారు. ఎన్టీఆర్, వైఎస్‌ఆర్ విశేషాదరణ పొందిన గొప్ప నాయకులని జూనియర్ ఎన్టీఆర్ కొనియాడారు. వర్సిటీ పేరు మార్పుతో ఎన్టీఆర్ కీర్తిని చెరిపివేయలేరని స్పష్టం చేశారు. తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ పేరును చెరిపివేయలేరని ట్విటర్ వేదికగా తెలిపారు.
''ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ విశేష ప్రజాదరణ పొందిన నాయకులే. ఈ విధంగా ఒకరి పేరు తొలగించి మరొకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్సార్ స్థాయిని పెంచదు... ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు ప్రజల హృదయాల్లో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు.'' -ట్విటర్లో జూనియర్ ఎన్టీఆర్
విద్యార్థులకు నాణ్యమైన వైద్య, విద్యను అందుబాటులోకి తీసుకురావాలని కోరుకున్న ఎన్టీఆర్ ఈ మహా విశ్వవిద్యాలయానికి అంకురార్పణ చేశారని నందమూరి కల్యాణ్ రామ్ అన్నారు. ఈ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యుత్తమంగా అభివృద్ధి చెందిందని, లెక్కలేనంత మంది నైపుణ్యం కలిగిన వైద్య నిపుణులను దేశాలనికి అందించిందని గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో వైద్య అధ్యయనాల మెరుగుదలకు ఎన్టీఆర్ చేసిన కృషిని స్మరించుకునేందుకు విశ్వవిద్యాలయానికి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని పేరు పెట్టారన్నారు.