ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Pub Drugs Case: పబ్​ కేసులో ఇద్దరికి రిమాండ్.. మరో ఇద్దరి కోసం గాలింపు - డ్రగ్స్ కేసు

pub drugs case: పుడ్డింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో డ్రగ్స్ కేసులో యజమానులకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ విధించింది. పబ్ యజమానులు అభిషేక్‌ ఉప్పాల, అనిల్ కుమార్​ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇప్పటికే నలుగురి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన బంజారాహిల్స్‌ పోలీసులు పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

Pub Drugs Case
Pub Drugs Case

By

Published : Apr 4, 2022, 1:04 PM IST

pub drugs case: పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్ యజమానులకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ విధించింది. నిందితులను చంచల్‌గూడ జైలుకు పోలీసులు తరలించారు. ఈ కేసులో దర్యాప్తును పోలీసులు మరింత వేగవంతం చేశారు. పబ్ యజమానులు అభిషేక్‌ ఉప్పాల, అనిల్ కుమార్‌ రిమాండ్​కు తరలించగా.. పరారీలో ఉన్న అర్జున్ వీరమాచినేని, కిరణ్‌రాజ్‌ల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఆగస్టు నుంచి వారు పబ్ నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇందులో ఎవరి పాత్ర ఉన్నా తప్పకుండా అరెస్టు చేస్తామని పశ్చిమ మండల డీసీపీ జోయల్ డేవిస్‌ పేర్కొన్నారు.

కొనసాగుతున్న దర్యాప్తు: పబ్‌ నిర్వాహకులు ఎప్పట్నుంచి డ్రగ్స్‌ దందా చేస్తున్నారు, ఎక్కడ నుంచి మత్తు పదార్ధాలను తీసుకువస్తున్నారు? ఇందుకోసం ఏజెంట్లను నియమించుకున్నారా? అనే కోణంలోను దర్యాప్తు ముమ్మరం చేశారు. అర్ధరాత్రి 2 గంటలకు పబ్‌లో పోలీసులు తనిఖీ చేశారు. పబ్‌లో తనిఖీల్లో భాగంగా మేనేజర్ అనిల్ కుమార్ డెస్క్ వద్ద అనుమానాస్పద ప్యాకెట్లు లభ్యమయ్యాయని ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించారు. అనుమానాస్పద ప్యాకెట్లను డ్రగ్స్‌గా గుర్తించిన పోలీసులు మొత్తం ఐదు ప్యాకెట్లలో 4 గ్రాముల డ్రగ్స్, ప్లాస్టిక్ ట్రే, ప్లాస్టిక్ స్ట్రాస్, టిస్యూ పేపర్స్, టూత్ పిక్స్ స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో భాగంగా తాగి పడేసిన 216 సిగరెట్ పీకలు, వాడిన టిష్యూ పేపర్స్ స్వాధీనం చేసుకున్నారు.

ప్రణాళిక ప్రకారమే డ్రగ్స్​ సరఫరా: పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడిచేసిన సమయంలో అక్కడున్న 148 మంది వివరాలు సేకరించారు. అందులో 20మంది పబ్‌ సిబ్బంది కాగా.. 90 మంది యువకులు, 38 మంది యువతులు ఉన్నట్లు పోలీసులు వివరించారు. 5 కొకైన్‌ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన పోలీసులు అందరూ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆధారాలు లేవన్నారు. బంజారాహిల్స్‌ పబ్‌ కేసులో పక్కా ప్రణాళిక ప్రకారమే డ్రగ్ సరఫరా చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నమ్మకమైన వ్యక్తులనే పార్టీకి పిలిచి డ్రగ్స్ అందిస్తున్నట్లు చెప్పారు. విదేశీ పర్యాటకుల కోసం 24గంటలపాటు మద్యం, ఆహార పదార్థాలు సరఫరా చేయాలనే నిబంధనను... పబ్ సిబ్బంది దుర్వినియోగం చేసినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:New Districts: రాష్ట్రంలో 13 నుంచి 26కు పెరిగిన జిల్లాలు.. ప్రారంభించిన సీఎం

ABOUT THE AUTHOR

...view details