ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మధ్యేమార్గంగా తగిన ఉత్తర్వులిస్తాం : హైకోర్టు - Kodali Nani Latest news

ఈ నెల 21వరకు మీడియాతో మాట్లాడకుండా నిలువరిస్తూ... రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ మంత్రి కొడాలి నాని దాఖలు చేసిన వ్యాజ్యంలో మధ్యేమార్గంగా తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు తెలిపింది. ' ఈ - వాచ్ ' యాప్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన 3 ప్రజాహిత వ్యాజ్యాలపై విచారణ ఈనెల 25కు వాయిదా పడింది. ఇంటింటికి రేషన్ వాహనాల రంగుల అంశంపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను... ఎస్‌ఈసీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ముందు అపీల్ చేసింది.

మధ్యేమార్గంగా తగిన ఉత్తర్వులిస్తాం : హైకోర్టు
మధ్యేమార్గంగా తగిన ఉత్తర్వులిస్తాం : హైకోర్టు

By

Published : Feb 17, 2021, 5:53 PM IST

Updated : Feb 18, 2021, 5:11 AM IST

మంత్రి కొడాలిపై ఎస్‌ఈసీ ఆంక్షల విషయంలో మధ్యేమార్గంగా తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు తెలిపింది. వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఎన్నికల నిర్వహణకే కమిషనర్‌కు విస్తృత అధికారాలు ఉంటాయి తప్ప... వ్యక్తుల వాక్ స్వాతంత్ర్యం హరించేందుకు వీల్లేదని మంత్రి తరపు న్యాయవాది పేర్కొన్నారు. మంత్రి చేసినవి విద్వేషపూరిత వ్యాఖ్యల కిందకు రావని ప్రభుత్వం తరపు న్యాయవాది ఏజీ శ్రీరామ్ వాదించారు. అలా భావిస్తే క్రిమినల్ కేసు నమోదు చేసి ఉండాల్సిందన్నారు. మంత్రి ఉచ్ఛరించే భాషను చూసి సమాజం ఆశ్చర్యానికి గురవుతోందని ఎస్‌ఈసీ తరపు న్యాయవాది అన్నారు. రాజ్యాంగ వ్యవస్థపై దాడి పోకడల్ని మొగ్గలోనే తుంచేయాల్సిన అవసరం ఉందన్నారు. వాక్ స్వాతంత్ర్య పరిమితుల అంశం విస్తృతమైందన్న అమికస్ క్యూరీ శ్రీ రఘురాం... పిటిషనర్ హక్కులు, ఎస్ఈసీ అధికారాలు, ప్రతిష్ట దృష్టిలో ఉంచుకొని తగిన ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు. ఈ మేరకు గురువారం తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఈ-వాచ్ విచారణ వాయిదా...

ఎస్ఈసీ తీసుకొచ్చిన ' ఈ - వాచ్ ' యాప్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన 3 ప్రజాహిత వ్యాజ్యాలపై విచారణ ఈనెల 25కు వాయిదా పడింది. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లేవనెత్తిన ప్రశ్నలకు ఈనెల 15న వివరాలు పంపామని ఎస్‌ఈసీ కోర్టుకు తెలిపింది. 'సి - విజిల్ ' యాప్ వినియోగానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశామన్నారు. ఎస్ఈసీ తెలిపిన అంశాల పరిశీలనకు కొంత సమయం పడుతుందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది తెలిపారు. ఈ మేరకు ధర్మాసనం విచారణ వాయిదా వేసింది.

రేషన్ పంపిణీ అనుమతి వాహనాలపై అప్పీల్...

ఇంటింటికి రేషన్ వాహనాల రంగుల అంశంపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను... ఎస్‌ఈసీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ముందు అపీల్ చేసింది. ధర్మాసనం విధుల ప్రారంభ దశలో అప్పీల్ వ్యవహారాన్ని ప్రస్తావించిన ఎస్‌ఈసీ తరపు న్యాయవాది... అత్యవసరంగా విచారణ జరపాలని అభ్యర్థించారు. వైకాపా రంగులతో పోలి ఉన్న మొబైల్ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కిందికి వస్తుందన్నారు. ఆన్ లైన్ విధానంలో అప్పీల్ దాఖలు చేశామన్నారు. భౌతికంగా దాఖలు చేస్తే గురువారం విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది. వాహనాలకు తటస్థ రంగులేసి తమ పరిశీలనకు తీసుకురావాలన్న ఎస్‌ఈసీ ఆదేశాలను ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జ్‌ తాత్కాలికంగా సస్పెండ్ చేసి.. మార్చి 15 వరకు రేషన్ పంపిణీకి అనుమతించారు.

ఉపా కేసు నమోదు హక్కుల్ని హరించడమే...

ఓ నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ కేసుల నమోదు సరికాదని పౌర హక్కుల ఉద్యమకారులు హైకోర్టులో వాదించారు. విశాఖ జిల్లా ముంచంగిపుట్టు, గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పోలీసులు ఉపా, ఐపీసీ సెక్షన్ల కింద తమపై నమోదు చేసిన కేసులు ప్రాథమిక హక్కులను హరించడమేనన్నారు. నేరం చోటు చేసుకోకుండానే కేసుల నమోదు చెల్లదన్నారు. పిటిషనర్లు ఎలాంటి నేరానికి పాల్పడ్డారో పోలీసులకే స్పష్టత లేదన్నారు. ప్రజల కోసం పనిచేసే పిటిషనర్లపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారన్నారు. పూర్తిస్థాయిలో వాదనలు వినేందుకు హైకోర్టు ఈనెల 24 కు విచారణ వాయిదా వేసింది.

ఇదీ చదవండీ... ఉక్కు పరిరక్షణ సమితి ప్రతినిధులకు సీఎం హామీ

Last Updated : Feb 18, 2021, 5:11 AM IST

ABOUT THE AUTHOR

...view details